
భారత్, చైనాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి ఈ ఏడాదితో 75 ఏళ్ళు పూర్తయ్యాయి. మరోవైపు ఐక్యరాజ్య సమితి కూడా 80 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏకపక్షవాదం, ఆధిపత్యం, శతృత్వాలతో నిండిపోయిన అంతర్జాతీయ పాలనా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందని ఆసియాలోనే అతిపెద్ద దేశాలుగా చైనా, భారత్‌లు భావిస్తున్నాయి.
తాము ప్రత్యర్ధులం కాదని భాగస్వాములమని ఇరు దేశాల నేతలు జిన్‌పింగ్, నరేంద్ర మోదీ ప్రతీసారీ స్పష్టం చేస్తూనే వస్తున్నారు. 2014 నుండి ఇప్పటివరకు ఈ ఇరువురు నేతలు 18సార్లు భేటీ అయ్యారు. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ), బ్రిక్స్ సభ్య దేశాలుగా భారత్, చైనాలు అంతర్జాతీయ పాలనా వ్యవస్థను సంస్కరణకు చర్యలు తీసుకుంటూ, న్యాయాన్ని పరిరక్షిస్తూ బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఈ ఏడాది తియాన్‌జిన్‌లో జరిగిన షాంఘై సదస్సులో చైనా నేత జిన్‌పింగ్ గ్లోబల్ గవర్నెన్స్ ఇనీషియేటివ్ (జిజిఐ)ని ప్రతిపాదించారు. సార్వభౌమాధికార సమానత్వం, చట్టబద్ధ పాలన, బహుళపక్షవాదం, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధిని సాధించడం వంటి అంశాల ప్రాతిపదికన గ్లోబల్ గవర్నెన్స్ వుండాలని సూచించారు. భారత ప్రధాని మోదీ కూడా ఇవే అభిప్రాయాలు వ్యకం చేశారు.
నిష్పాక్షికతతో కూడిన, బహుళ ధృవ ప్రపంచ వ్యవస్థను సృష్టించడంలో సహ భాగస్వామ్య దేశాలుగా చైనా, భారత్ తమ దార్శనికతను చాటి చెప్పాయి. నియంతృత్వ వైఖరి, ఏకపక్షవాదం స్థానంలో బహుళపక్షవాదం, అందరినీ కలుపుకుని పోవడం వుండాలని భావిస్తున్నాయి. చైనా, భారత్ సంయుక్త నాయకత్వాన 21వ శతాబ్దపు అంతర్జాతీయ పాలనా వ్యవస్థను పునర్నిర్వచించవచ్చని ఇరు దేశాలు భావిస్తున్నాయి.
వర్ధమాన దేశాల మధ్య సుహృద్భావం, సంఘీభావం పెంపొందాలని కోరుకుంటున్నాయి. వాస్తవంగా అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు సుస్థిరమైన పరిష్కారాలను కనుగొనాల్సి వుందని, ఇందుకు అభివృద్ది చెందిన దేశాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వుందని జిన్‌పింగ్ తియాన్‌జిన్ సదస్సులో పేర్కొన్నారు.
చైనా, భారత్‌లు పరస్పరం సహకరించుకుంటూ, కలిసి పనిచేయడం వల్ల 280 కోట్ల మంది ప్రజల సంక్షేమ సౌభాగ్యాలు మెరుగవుతాయని, వర్ధమాన దేశాల వాణి మరింత బలపడుతుందని, నిజమైన ‘ఆసియా శతాబ్దం’ సాకారానికి దోహదపడుతుందని ఇరువురు నేతలు భావిస్తున్నారు.
పశ్చిమ దేశాల ఆధిపత్యం క్రమేపీ క్షీణిస్తూండడం, ఆసియా/యూరోసియా దేశాల ప్రాముఖ్యత పెరుగుతుండడం పైగా వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, కరోనా వంటి మహమ్మారులు, ఆర్థిక అసమానతలు వంటి అంతర్జాతీయ సవాళ్ళ నేపథ్యంలో పటిష్టమైన అంతర్జాతీయ పాలనా వ్యవస్థ కోసం డిమాండ్లు తలెత్తుతున్నందున చైనా, భారత్‌ల సహకారం కీలకంగా మారుతోంది.
More Stories
ట్రంప్ పాలనపై అమెరికా వ్యాప్తంగా నో కింగ్స్ నిరసలు
రెండేండ్లలో 63 శాతం తగ్గిన అమెరికాకు భారతీయ విద్యార్థులు
హెచ్-1 బి వీసా ఫీజ్ పెంపుపై యుఎస్ చాంబర్ దావా