పాక్‌ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు సహా 10 మంది మృతి

పాక్‌ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు సహా 10 మంది మృతి
 * శాంతి చర్చలకు ముందే కాల్పుల విరమణ ఉల్లంఘించిన పాక్ 

రెండ్రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్‌.. అఫ్ఘాన్‌పై మరోసారి దాడులకు దిగింది. డ్యారాండ్‌ లైన్‌ వెంబడి అఫ్ఘాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో పాక్‌ వైమానిక దాడులకు పాల్పడింది. దీంతో పది మంది మరణించారు. వారిలో ముగ్గురు అఫ్ఘాన్‌ దేశవాళి క్రికెటర్లు కూడా ఉన్నారు. మృతిచెందిన క్రికెటర్లను కబీర్‌, సిబాతుల్లా, హరూన్‌గా గుర్తించారు.

మృతుల్లో ముగ్గురు క్రికెటర్లు ఉన్నట్లు అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (ఎసిబి) ధ్రువీకరించింది. దీంతో వచ్చే నెలలో పాకిస్థాన్‌, శ్రీలంక జట్లతో జరగాల్సిన ముక్కోణపు టీ20 సిరీస్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఏసీబీ ప్రకటించింది. ఈ సందర్భంగా ఏసీబీ సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టిది.

“పాక్టికా ప్రావిన్స్‌లోని ఉరుగూన్ జిల్లాకు చెందిన ముగ్గురు యువ క్రికెటర్లు పాకిస్థాన్‌ వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయారు. పాక్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో ఎనిమిది మంది పౌరులు మరణించారు. వారిలో ముగ్గురు అఫ్గాన్‌ క్రికెటర్లు కబీర్‌ అఘా, సిబ్గుతుల్లా, హరూన్‌ ఉన్నారు. పాక్టికా రాజధాని శరణలో స్నేహపూర్వక మ్యాచ్‌ ఆడిన అనంతరం స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది” అని తెలిపింది.

కాగా, పాక్‌ కాల్పులను తాలిబన్‌ పాలకు దృవీకరించారు. పాక్టికా ప్రావిన్స్‌లోని పలు జిల్లాల్లో పాకిస్థాన్‌ వైమానిక దాడులు చేసిందని తాలిబన్‌ సీనియర్‌ అధికారి చెప్పారు. దీంతో ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ ఉల్లంఘించిందని వెల్లడించారు. అర్గున్‌, బెర్మల్‌ జిల్లాల్లో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయని తెలిపారు.  శనివారం అఫ్ఘాన్‌, పాక్‌ మధ్య ఖతార్‌లో శాంతి చర్చలు జరుగనున్న నేపథ్యంలో ఈ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం. 

ఇప్పటికే పాక్‌ ప్రతినిధులు ఖతార్‌ రాజధాని దోహాకు చేరుకున్నారు. శనివారం తాలిబన్‌ ప్రతినిధులు కూడా అక్కడి చేరుకునే అవకాశం ఉందని రాయిటర్స్‌ వెల్లడించింది.  “అఫ్గాన్‌ అథ్లెట్‌ క్రికెటింగ్‌ కుటుంబానికి ఇది తీరని లోటు. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. గాయపడిన పౌరులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. పాకిస్థాన్‌ పాల్గొనబోయే ముక్కోణపు టీ20 సిరీస్‌ నుంచి వైదొలగాలని మేము నిర్ణయించుకున్నాం” అని అఫ్గాన్ బోర్డు సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి గౌరవార్థం, నవంబర్ చివర్లో జరగాల్సిన ట్రై-నేషన్ టీ20 సిరీస్‌ నుంచి ఆఫ్ఘాన్ జట్టు తప్పుకుంటోంది. ఈ సిరీస్లో శ్రీలంక, పాకిస్థాన్, అఫ్గాన్ పాల్గొనాల్సి ఉంది. కానీ, తాజా దాడికి నిరసనగా అఫ్గాన్ ఆ సిరీస్ను బాయ్కట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ‘బోర్డు ప్రకారం, ఉరుగూన్ జిల్లాలో జరిగిన దాడిలో కబీర్, సిబ్గతుల్లా, హరూన్ అనే ముగ్గురు దేశీయ క్రికెటర్లు బలయ్యారు. మరో ఏడుగురు గాయపడ్డారు’ అని అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు తమ అధికారిక ప్రకటనలో తెలిపింది.

“పాకిస్థానీ వైమానిక దాడుల్లో మహిళలు, పిల్లలు, అలాగే దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్న యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం దారుణం. పౌర ప్రాంతాలపై దాడి చేయడం పూర్తిగా అమానుషం, చట్టవిరుద్ధం. ఇవి మానవ హక్కుల ఉల్లంఘన. ఈ విషాద నేపథ్యంలో పాకిస్థాన్తో జరగాల్సిన మ్యాచ్‌ల నుంచి తప్పుకునే అఫ్గాన్ బోర్డు నిర్ణయాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను” అంటూ అఫ్గాన్ వన్డే కెప్టెన్ రషీద్ ఖాన్ ఎక్స్‌ లో పోస్టు చేస్తూ తెలిపారు.