
కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలోని ద్వారపాలక విగ్రహాలపై పూత పూసిన బంగారు-రాగి తాపడాలను తిరిగి ప్రతిష్ఠించారు. తులం మాసం సందర్భంగా ఆలయాన్ని ప్రారంభించిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు 14 బంగారు-రాగి తాపడాలను కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు తీసుకు వచ్చినట్లు తెలిపారు.
చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ నుంచి తిరిగి తీసుకువచ్చి ఆలయ పూజారులు, అధికారుల సమక్షంలో ప్రతిష్ఠించారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు గంట సమయం పట్టిందని అధికారులు తెలిపారు. బంగారు తాపడాలను రాతితో తయారైన విగ్రహాలపై మేకులతో బిగించినట్లు వివరించారు. అక్టోబర్ 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఆలయాన్ని సందర్శించునున్నారు.
మరోవైపు తులం మాస పూజల కోసం శబరిమల అయ్యప్ప ఆలయాన్ని శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తెరిచారు. అక్టోబర్ 17- 22 వరకు ఐదు రోజుల పాటు తెరవనున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్వమ్ బోర్డు (టీడీబీ) ప్రకటించింది. ఉదయాస్తమాన పూజ, పడిపూజ, కలశాభిషేకం, పుష్పాభిషేకం వంటి ఐదు రోజుల ప్రత్యేక ఆచారాల తర్వాత అక్టోబర్ 22న రాత్రి 10 గంటలకు మూసివేస్తామని వివరించింది.
ఇప్పటికే దాదాపు 30,000 మంది భక్తులు అయ్యప్ప దర్శనానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు ఈ బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడు బెంగళూరు వ్యాపార వేత్త ఉన్నికృష్ణన్ పొట్టిని కేరళ హైకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. గురువారం తిరువనంతపురంలోని క్రైమ్‌బ్రాంచ్ ఆఫీసులో ఉన్నికృష్ణన్ పొట్టీని విచారించిన సిట్, శుక్రవారం పులిమత్‌లోని ఆయన నివాసం నుంచి కస్టడీలోకి తీసుకుంది.
తర్వాత పొట్టీని ఆస్పత్రికి తరలించిన సిట్ అధికారులు వైద్యపరీక్షలు నిర్వహించారు. కాగా శబరిమల అయ్యప్ప ఆలయంలోని ద్వార పాలక విగ్రహాల బంగారం చోరీ సహా శ్రీకోవిల్‌లో ద్వారాల్లో పసిడి దొంగతనంపై కేరళ హైకోర్ట్‌లో విచారణ సాగుతోంది. ఉన్నట్లుండి తాపడాల బరువు 4.524 కేజీలు తగ్గడాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు, వీటిని తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువును సరిచూడలేదని ప్రశ్నించింది.
అలాగే ముందుస్తు అనుమతి తీసుకోకుండా ద్వారపాలక విగ్రహల బంగారు తాపడాలను మరమ్మతుల నిమిత్తం తొలగించడం పైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేసులపై దర్యాప్తు చేస్తున్న సిట్, జరిగిన దొంగతనాల్లో ట్రావెన్‌కోర్ దేవస్వోం బోర్డు సభ్యులతో పాటు ఇతర అధికారుల పాత్రపైనా ఆరా తీస్తోంది. ఆరు వారాల్లో పూర్తి నివేదిక అందజేయాలని సిట్‌ను కేరళ హైకోర్టు ఆదేశించింది.
More Stories
అహ్మదాబాద్ లో 2030 కామన్వెల్త్ గేమ్స్
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కు సుప్రీంకోర్టు అనుమతి
ఝార్ఖండ్ లో 32 మంది మావోయిస్టుల మృతి, 266 మంది అరెస్ట్