హిందూ దేవుళ్లను దూషించారని రాంగోపాల్‌వర్మపై కేసు

హిందూ దేవుళ్లను దూషించారని రాంగోపాల్‌వర్మపై కేసు
వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి చట్టపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యువతను పెడదోవ పట్టించేలా అతని వ్యాఖ్యలు ఉన్నాయంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు రాంగోపాల్‌వర్మతో పాటు, ఓ వ్యాఖ్యాతపై కేసు నమోదు చేశారు.

సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ, యాంకర్ స్వప్నపై రాజమహేంద్రవరం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ సోషల్ మీడియా ఛానల్‌ ఇంటర్వ్యూలో హిందూ ఇతిహాసాలు, దేవుళ్లు, భారతీయ సైన్యం, ఆంధ్రులను రామ్‌గోపాల్‌ వర్మ దూషించినట్లు వారిపై కేసు నమోదు చేశారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది మేడా శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు రామ్‌గోపాల్‌వర్మ, యాంకర్ స్వప్నపై కేసు నమోదైంది. 

ఇంటర్వ్యూలో యాంకర్ స్వప్న ఉద్దేశపూర్వకంగానే వివాదాస్పద ప్రశ్నలు అడిగారని ఫిర్యాదులో మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. వాటికి రామ్‌గోపాల్‌ వర్మ కావాలనే విద్వేషపూరితంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. వీరిద్దరిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మేడా శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు రామ్‌గోపాల్‌వర్మ, స్వప్నపై రాజమహేంద్రవరం త్రీ టౌన్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

 కాగా, ఇప్పటికే ఏపీ, తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో వివిధ సందర్భాల్లో వివిధ అంశాలపై ఆర్జీవీపై కేసులు ఎదుర్కొన్న విషయం విదితమే. “రాంగోపాల్​వర్మను అనుసరిస్తూ యువత పెడదారి పడుతున్నారు. కుటుంబ వ్యవస్థ పాడవుతుంది. రాంగోపాల్​వర్మను, తెరవెనుక ఆయనకు మద్ధతు తెలుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. తెలుగు రాష్ట్రాల నుంచి రాంగోపాల్ వర్మను తరిమికొట్టాలి. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని మేడా శ్రీనివాస్ కోరారు

ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో మొదట ఉంటారని పలువురు ధ్వజమెత్తుతున్నారు. ఇటీవలి కాలంలో వివిధ అంశాల్లో రాంగోపాల్​వర్మపై కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్త మాదిరిగా వ్యవహరించి అనేక వివాదాల విషయమై ఆయనపై కేసులు అయ్యాయి. 

వాటి విచారణలకు అప్పుడప్పుడూ హాజరవుతున్నారు. ఇప్పుడు మరోసారు ఇలాంటి వ్యాఖ్యలతో కేసుల పాలవుతున్నారు. గతంలోనూ ముంబైలో ఓ చెక్ బౌన్స్ కేసులో రాంగోపాల్​వర్మకు జైలుశిక్ష పడింది. అయితే వారితో రాజీకి వచ్చి ఆ కేసు నుంచి బయటపడ్డారు.