బీహార్ లో ఎన్నికల తర్వాతే ఎన్డీయే సీఎం అభ్యర్థి

బీహార్ లో ఎన్నికల తర్వాతే ఎన్డీయే సీఎం అభ్యర్థి
బీహార్ లో ఎన్నికల తర్వాతే బీజేపీ, దాని మిత్రదేశాలు తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తాయని కేంద్ర హోంమంత్రి, అమిత్ షా వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శరణ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ  బిహార్లోని ఎన్డీఏలో చీలికలు ఉన్నాయనే ఊహాగానాలను  తోసిపుచ్చారు. త్వరలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 

నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత ఎన్డీఏ గత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతుందని,  బిహార్లో భారీ మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఈసారి బిహార్ ప్రజలకు నాలుగు సార్లు దీపావళి జరుపుకొనే అవకాశం వచ్చిందని చెప్పారు. ఎన్డీఏకు మోదీ ప్రధాన ఆకర్షణ అయినా, ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ నేతృత్వంలోనే బిహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు షా వెల్లడించారు.

లాలూ- రబ్రీ దేవి జంగిల్ రాజ్ పాలనకు వ్యతిరేకంగా నీతీశ్ పోరాడాడని గుర్తు చేశారు.“ఈ సారి బిహార్ ప్రజలకు నాలుగు దీపావళి పండగలు జరుపుకొనే అవకాశం వచ్చింది. శ్రీరాముడు అయోధ్యకు తిరిగివచ్చినందుకు మొదట దీపావళి చేసుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వ పథకం కింద మహిళల ఖాతాల్లో రూ. 10,000 జమ చేసినప్పుడు రెండోది, జీఎస్టీపై 5 శాతానికి తగ్గించినప్పుడు మూడో దీపావళి. ఇక నవంబర్ 14న ఓట్ల లెక్కింపు రోజు నాలుగో దీపావళిని జరుపుకొంటారు” అని అమిత్ షా తెలిపారు.

” నీతీశ్ కుమార్ బిహార్ను జంగిల్ రాజ్ నుంచి విముక్తి చేశారు. నీతీశ్ కుమార్ నేతృత్వంలోనే బిహార్ ఎన్నికలకు పోటీ చేస్తున్నాం. ప్రధాని మోదీ గత 11 ఏళ్లుగా బిహార్ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ఇప్పటికే బిహార్లో అనేక మౌళిక సదుపాయాలను కల్పించాం. ఫలితంగానే బిహార్లోని ఏ చివరికైనా ఐదు గంటల్లో చేరుకుంటున్నారు” అని చెప్పారు. 

ఇదంతా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ కలిసి అభివృద్ధి చేశారని పేర్కొంటూ తమ ప్రభుత్వం ఏర్పాటు కాకముందు బిహార్లో వలసలు, దోపీడీలు, హత్యలు, కిడ్నాప్లు సాధారణంగా ఉండేవని అమిత్ షా గుర్తు చేశారు.  మరోవైపు గ్యాంగ్స్టర్ మహ్మద్ శాబుద్దీన్ కుమారుడు ఒసామాకు ఆర్జేడీ టికెట్ కేటాయించడం పట్ల అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇలాంటి అభ్యర్థులను బరిలో దింపి బిహార్ ప్రజల భద్రతకు ఎలా హామీ ఇస్తారని ప్రశ్నించారు. ఆపరేషన్  సిందూర్పై మాట్లాడిన షా, శత్రువుల ఇళ్లకు వెళ్లి దాడి చేశామని గుర్తు చేశారు. “కశ్మీర్ మనదా? కాదా? మీరే చెప్పండి. జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయాలా? వద్దా? ప్రధాని మోదీ ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్లో ప్రధాన స్రవంతిలో కలిపారు. అంతకుముందు కాంగ్రెస్ పాలనలో కశ్మీర్లో ఉగ్రవాదాలు రక్తంతో హోళీ ఆడేవారు.” అని అమిత్ షా అంటూ ధ్వజమెత్తారు.