ఛోక్సీని భారత్‌కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు గ్రీన్ సిగ్నల్

ఛోక్సీని భారత్‌కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు గ్రీన్ సిగ్నల్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీని భారత్‌కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అనుమతి ఇచ్చింది. భారత్‌ నుంచి వచ్చిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న అంట్వర్ప్‌ కోర్టు, బెల్జియం అధికారుల చర్య సరైనదేనని పేర్కొంటూ తీర్పు వెలువరించింది. దీంతో ఎగవేత కేసులో భారత్‌ కీలక విజయాన్ని సాధించినట్లే. కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ప్రకారం, ఛోక్సీకి పైస్థాయి కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఈ నిర్ణయం అతడిని భారత్‌కు తీసుకురావడంలో ముఖ్యమైన ముందడుగుగా చెప్పాలి.

అధికార వర్గాల సమాచారం మేరకు, ఛోక్సీని తిరిగి భారత్‌కు రప్పించేందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు ఇప్పటికే వేగవంతం అయ్యాయి. మెహుల్ ఛోక్సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను సుమారు రూ.13,000 కోట్లకు పైగా మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు. వజ్ర వ్యాపారవేత్తగా పేరొందిన అతడు తన సన్నిహితుడు నీరవ్​ మోదీతో కలిసి ఈ మోసాన్ని జరిపినట్లు సీబీఐ, ఈడీ దర్యాప్తుల్లో తేలింది. 

ఈ ఇద్దరూ బ్యాంక్ నుంచి లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ ల ద్వారా పెద్దఎత్తున విదేశీ రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారిపోయారు.  2018లో ఈ కుంభకోణం వెలుగులోకి రావడంతో ఛోక్సీ దేశం విడిచి అంటిగ్వా, బార్బుడాకి వెళ్లిపోయాడు. ఆ దేశ పౌరసత్వం కూడా పొందాడు. భారత దర్యాప్తు సంస్థలు పలుమార్లు అతడిని భారత్‌కు అప్పగించమని డిమాండ్ చేశాయి కానీ, అక్కడి న్యాయపరమైన అవరోధాల వల్ల ప్రక్రియ ముందుకు సాగలేదు.

ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ఛోక్సీ బెల్జియంలోని అంట్వర్ప్‌ నగరంలో కనిపించగా, స్థానిక పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. భారత్‌ తరఫున సీబీఐ, ఈడీ సంయుక్తంగా చేసిన అభ్యర్థన మేరకు బెల్జియం అధికారులు ఈ అరెస్టు చేపట్టారు. అప్పటి నుంచి ఛోక్సీ బెల్జియం జైలులోనే ఉన్నాడు.  ఇటీవల అతడు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా, కోర్టు “దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉంది” అంటూ ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. అదనంగా, భారత ప్రభుత్వం బెల్జియం కోర్టుకు సమర్పించిన పత్రాలలో, అతడిని అప్పగిస్తే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం నిర్బంధం చేస్తామని, అవసరమైన భద్రత, వైద్య సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.