సొంత ఊరికే పికె అపరిచితుడు

సొంత ఊరికే పికె అపరిచితుడు
 
పెద్దాడ నవీన్, సీనియర్ జర్నలిస్ట్
 
జాతీయ రాజకీయాల్లో చాణక్యుడిగా పేరు గడించిన  ప్రశాంత్ కిషోర్, తన సొంత పూర్వీకుల గ్రామంలోనే ఒక అపరిచితుడు. బీహార్‌లోని రోహ్‌తాస్ జిల్లా కరహగర్ ఆయన స్వగ్రామం. కానీ అక్కడి ప్రజలకు ఆయనెవరో పెద్దగా తెలియదు. “ఆయన ఎప్పుడూ ఊరికి రాలేదు, వస్తే తెలిసేది” అంటారు గ్రామస్థులు. పికె బాల్యం, విద్యాభ్యాసం అంతా బక్సర్‌లో గడిచింది. అందుకే ఆయనకు స్వస్ధలంతో సంబంధాలు దాదాపు తెగిపోయాయని “ది ఫెడరల్” వెబ్ పత్రిక వివరించింది.

ప్రశాంత్ కిషోర్ తండ్రి, దివంగత డాక్టర్ శ్రీకాంత్ పాండే, బక్సర్‌లో పేరున్న వైద్యుడు. ప్రజల డాక్టర్‌గా ఆయనకు మంచి పేరుంది. ఈ వారసత్వం ప్రశాంత్ కిషోర్‌కు రాజకీయ ఆయుధంగా మారింది. తాను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకినని, ప్రజాసేవ చేసిన కుటుంబం నుంచి వచ్చానని ఆయన చెప్పుకుంటారు.

రాజకీయ వ్యూహకర్తగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) జనతాదళ్ (యునైటెడ్) (జెడియు) భారత జాతీయ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకె) తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) మొదలైన పార్టీలకు పనిచేసి, గెలిపించిన పీకే, ఇప్పుడు బీహార్‌లో మార్పు కోసం తానే రాజకీయ నాయకుడిగా మారారు. 
‘జన్ సురాజ్’ పేరుతో ఒక ఉద్యమం ప్రారంభించారు. రెండేళ్లపాటు, 3,500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు.  బీహార్‌లోని ప్రతి మూలకు వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఈ పాదయాత్ర ద్వారానే తన పార్టీకి పునాదులు వేశారు. కుల, కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలికి, అభివృద్ధి ఆధారిత పాలన అందిస్తానని ఆయన హామీ ఇస్తున్నారు.

ఆయన ఎన్నికల వ్యూహం కూడా విభిన్నంగా ఉంది. తన పార్టీ అభ్యర్థులుగా రాజకీయ నాయకులను కాకుండా డాక్టర్లు, ప్రొఫెసర్లు, రిటైర్డ్ అధికారుల వంటి విద్యావంతులను, నిపుణులను నిలబెడుతున్నారు. పికె ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపైనే తన దృష్టి అని ప్రకటించారు. “మాకు 150 సీట్లకు పైగా వస్తాయి, లేదంటే 10 లోపే వస్తాయి. మధ్యేమార్గం లేదు” అని ఆయన ధీమాగా చెబుతున్నారు. ‘ఓటు చీలిపోతుంది’ అనే భయాన్ని ప్రజల నుంచి తొలగించేందుకే ఈ రకమైన ప్రకటనలు చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. 

 
“పీకే ఆలోచనలు బాగున్నాయి, కానీ బీహార్‌లో కులమే ప్రధానం. ఆయనకు ఓటేస్తే వృథా అవుతుందేమో” అనే సందేహం ఓటర్లలో ఉంది. ఆర్జేడీ, బీజేపీ వంటి ప్రధాన పార్టీలు ఆయన్ను ‘ఓట్లు చీల్చే వ్యక్తి’ (ఓటు కట్వా) అని విమర్శిస్తున్నాయి. ఈ విమర్శలే ఆయన ప్రభావాన్ని సూచిస్తున్నాయి.  బ్రాహ్మణుడైన ప్రశాంత్  కిషోర్ ప్రయోగం, కొత్త ముఖాలతో కూడిన ఆయన రాజకీయాలు, కుల సమీకరణాలను దాటి విజయం సాధిస్తాయో లేదో రాబోయే ఎన్నికలు తేలుస్తాయి.