రష్యా చమురు కొనుగోలుపై ట్రంప్ వ్యాఖ్యలు కొట్టేసిన భారత్!

రష్యా చమురు కొనుగోలుపై ట్రంప్ వ్యాఖ్యలు కొట్టేసిన భారత్!
ఇకపై రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదని, ఈ మేరకు ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ చేసిన వాఖ్యాలను భారత్ సున్నితంగా కొట్టిపారేసింది. దేశ భద్రత, ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని, ఇంధన దిగుమతుల విషయంలో తమ విధానాలు పూర్తిగా దేశీయ అవసరాల మేరకే ఉంటాయని స్పష్టం చేసింది.

కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ ఓ ప్రకటనలో “భారత్ భారీ మొత్తంలో చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో ఒడిదుడుకులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే మా ప్రథమ ప్రాధాన్యత. మా దిగుమతి విధానాలు పూర్తిగా ఈ లక్ష్యం ఆధారంగానే ఉంటాయి” అని తెలిపారు. 

“స్థిరమైన ఇంధన ధరలు, సురక్షితమైన సరఫరా- ఈ రెండే మా ఇంధన విధానంలోని ప్రధాన లక్ష్యాలు. దీనికోసం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన వనరులను విస్తృతం చేసుకుంటున్నాం” అని స్పష్టం చేశారు. ఇక అమెరికా విషయానికొస్తే  చాలా ఏళ్లుగా ఆ దేశం నుంచి ఇంధన సేకరణను పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు జైస్వాల్ చెప్పారు. 

గత దశాబ్ద కాలంలో ఇది క్రమంగా పెరిగిందని, ప్రస్తుత అమెరికా ప్రభుత్వం కూడా భారత్‌తో ఇంధన సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఆసక్తి చూపుతోందని తెలిపారు. ఈ విషయంపై చర్చలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.

అంతకు ముందు, రష్యా నుంచి భారత్‌ చమురును దిగుమతి చేసుకోవడంపై ప్రధాని మోదీ వద్ద తాను ఆందోళన వ్యక్తం చేశానని ట్రంప్‌ చెప్పారు. మాస్కో నుంచి భారత్‌ చమురు కొనడం వల్ల ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగించేందుకు పుతిన్‌ ఆ నిధులు ఉపయోగిస్తున్నారని అమెరికా భావిస్తున్నదని తెలిపారు. ఈ కొనుగోళ్లపై తాను సంతోషంగా లేనని చెప్పాను. 

 
ఈ సందర్భంగా ఇక నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని ప్రధాని మోదీ ఈరోజు తనకు హామీ ఇచ్చారని. ఇదొక కీలక ముందడుగు అని చెప్పారు. చైనా కూడా రష్యా ఆయిల్‌ను కొనకుండా చేస్తానని, ఇక అదే మిగిలి ఉందని తెలిపారు. భారత్‌, చైనా అమెరికాతో కలిసి వస్తే పుతిన్‌ చేస్తున్న యుద్ధానికి చెక్‌ పెట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, భారత ఆర్థిక వ్యవస్థకు రష్యా చమురు ఎంతో ముఖ్యమని రష్యా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. రష్యా డిస్కౌంట్‌పై భారత్‌కు చమురు ఎగుమతి చేస్తున్నదని, దాంతో ఆ దేశానికి ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూరుతున్నదని తెలిపింది.