పొంగులేటి- సురేఖ వ్యవహారంలో చీలిపోయిన రేవంత్ మంత్రివర్గం

పొంగులేటి- సురేఖ వ్యవహారంలో చీలిపోయిన రేవంత్ మంత్రివర్గం
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  వ్యవహారాలు, ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు, మరో మంత్రి కొండా సురేఖ ఉదంతం.. వంటి పరిణామాలతో తెలంగాణ మంత్రివర్గం రెండుగా చీలిపోయింది. పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్‌కే అన్ని కాంట్రాక్టులు అప్పజెప్పడంపై గురువారం జరిగిన మంత్రివర్గ భేటీలో పలువురు మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 
 
దీంతో క్యాబినెట్‌ ఎజెండా పక్కకు పోయి, పొంగులేటి కాంట్రాక్టులు, ఖజానా చెల్లింపుల పైనే చర్చ జరిగినట్టు సమాచారం. తొలుత 42 శాతం బీసీ రిజర్వేషన్లపై చర్చ ప్రారంభించగానే మంత్రి పొన్నం ప్రభాకర్‌ కల్పించుకొని కొండా సురేఖ ఇంటిపైకి అర్ధరాత్రి వేళ పోలీసులను పంపడంపై అభ్యంతరం వ్యక్తంచేసినట్టు తెలిసింది. రాజకీయంగా తమకు అన్యాయం జరుగుతున్నదని బీసీలు ఆందోళనలు చేస్తున్న వేళ బీసీ మంత్రిని లక్ష్యంగా చేసుకోవడమేంటని ప్రశ్నించినట్టు సమాచారం. 
 
క్యాబినెట్‌ నుంచి ఆమెను బర్తరఫ్‌ చేస్తారని, ఆమెకు ప్రొటోకాల్‌ తొలగిస్తారని, సెక్యూరిటీ కుదించారన్న వార్తలు బీసీల్లో పెద్దఎత్తున చర్చకు దారితీశాయని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఇటువంటివి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తాయని, పోలీస్‌ ఉన్నతాధి కారులు సంయమనంతో వ్యవహరించాలని, మంత్రిపై దురుసుగా ప్రవర్తించడం సరికాదని అన్నట్లు తెలిసింది. ఇది ప్రభుత్వంపైనా, పార్టీపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని మండిపడినట్టు సమాచారం. 
 
మంత్రుల పీఏ, సీఎస్‌, ఓఎస్డీ, సహాయ సిబ్బందిని తొలగించే సమయంలో వారికి కనీస సమాచారం ఇవ్వకపోవడం ఎంతవరకు సబబని మంత్రి పొన్నం ప్రభాకర్‌ క్యాబినెట్‌లో నిలదీసినట్టు తెలిసింది. సొంత ప్రభుత్వంలోని మంత్రిపై మనమే ఇలా వ్యవహరిస్తే ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్టు అవుతుందని, దీంతో వారు మరింత రెచ్చిపోతారని ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం. 
 
బీసీ బిల్లుకు ఆమోదం లభించకపోవడం, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్‌ అంశం తేలకపోవడం, దీనికి తోడు బీసీ మంత్రులపై ఇలాంటి ఆరోపణలు, దాడులు ఎంతమాత్రం సమర్థనీయం కాదని ప్రభాకర్‌ చెప్పగా, బీసీ మంత్రులు ఆయనకు మద్దతు తెలిపినట్టు తెలిసింది. మేడారం జాతర జాతరకు సంబంధించిన రికార్డులను ఆగమేఘాల మీద ఆర్‌ఎండ్‌బీ శాఖకు అప్పగించాల్సిన అవసరం ఏముందని మండిపడినట్టు తెలిసింది.
 
ప్రభాకర్‌ మాట్లాతుండగానే జోక్యం చేసుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మిషన్‌ భగీరథ పథకం ప్రజా ప్రయోజనం లేని పథకంగా మారిందని ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం. మిషన్‌ భగీరథపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని నిందిస్తూ ఇప్పుడే అవే మిషన్‌ భగీరథ పనుల్లో రాఘవ వాటర్‌ వర్క్స్‌కు మరో మరో మూడు పనులు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం ఏంటని నిలదీసినట్టు తెలిసింది.
మిషన్‌ భగీరథ పథకం నిర్వహణ కోసం మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి దాదాపు రూ. 900 కోట్లు చెల్లింపులు చేస్తున్నారని, రాష్ట్ర ఖజానాలో ఉన్న సొమ్మంతా ఆయన కంపెనీకి, ఆయన సూచించిన వ్యక్తులకే వెళ్లిపోతున్నదని భట్టివిక్రమార్క తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. రాఘవ కంపెనీకి అప్పజెప్పిన కాంట్రాక్టు పనులు ఏవీ మొదలు కాలేదని, అయినప్పటికీ మొబిలైజేషన్‌, అడ్వాన్సుల పేరుతో వందల కోట్ల రూపాయలు అప్పనంగా అప్పగిస్తున్నారని, ఇది ఎంతమాత్రమూ సబబు కాదని ఘాటుగా అన్నట్టు సమాచారం.
 
మంత్రులందరూ మూకుమ్మడిగా దాడికి దిగడంతో ఏం చేయాలో అర్థంకాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చాలాసేపు మౌనంగా ఉండిపోయినట్టు తెలిసింది. కాసేపటికి తేరుకుని బిల్లుల చెల్లింపు, పొంగులేటి కంపెనీలకు బిల్లుల మంజూరులో ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలపై తాను విచారణ చేయిస్తానని, ఆయనకు అప్పగించిన ప్రాజెక్టుల పనితీరుపైనా విచారణ చేయిస్తానని ప్రకటించినట్టు తెలిసింది.