
ముగ్గురు డివిజన్ కార్యదర్శులు, ఐదుగురు దండకారణ్యం జోనల్ కమిటీ సభ్యులు, 20 మంది డివిసి సభ్యులు సహా 169 మంది పోలీసుల ముందు లొంగిపోయారు.శుక్రవారం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ సమక్షంలో జగదల్‌పుర్‌లో అధికారికంగా లొంగిపోనున్నారు. 70కిపైగా ఆయుధాలు అప్పగించనున్నట్లు సమాచారం.
క్లిష్ట పరిస్థితుల్లో లొంగుబాటు నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటూ లొంగిపోయే ముందు ఆశన్న భావోద్వేగ సందేశం ఇచ్చారు. తమ సహచరుల్లో కొందరు ఇంకా పోరాడాలనుకుంటున్నారని చెప్పారు. మన భద్రతను పరిగణలోకి తీసుకోవాలని సహచరులను కోరుతున్నానని తెలిపారు. ముందుగా మనల్ని మనం రక్షించుకోవడం చాలా అవసరంమని పేర్కొంటూ సమాజ ప్రధాన స్రవంతిలోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. అడవులు, ఇతర రాష్ట్రాల్లోని మావోయిస్టులు లొంగుబాటులో తనతో పాటు చేరేవారు సంప్రదించాలని ఆశన్న పిలుపునిచ్చారు.
ములుగు జిల్లా పోలోనిపల్లికి చెందిన ఆశన్న ఐటిఐ, పాలిటెక్నిక్ చదివారు. 1991లో పీపుల్స్‌వార్ పార్టీలో చేరిన ఆయన, 1999లో పీపుల్స్‌వార్ యాక్షన్ టీం సారథిగా పగ్గాలు చేపట్టారు. అదే ఏడాది హైదరాబాద్‌లో ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్రను పట్టపగలే నడిరోడ్డుపై హత్య చేసిన ఆపరేషన్‌కు ఆయనే నేతృత్వం వహించినట్లు ప్రచారంలో ఉంది. 2000లో ఏపీ హోంమంత్రి ఎ.మాధవరెడ్డి ప్రయాణిస్తున్న కారును మందుపాతరతో పేల్చేసి చంపేయడం, 2003లో అలిపిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌ను క్లెమోర్‌మైన్‌తో పేల్చి ఆయనపై హత్యాయత్నానికి పాల్పడిన దుశ్చర్యలతో ఆశన్న పేరు విస్తృతంగా ప్రచారమైంది.
నక్సలిజం పై పోరులో ఇది గుర్తుంచుకోదగిన రోజు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మావోయిస్టు పార్టీకి దశాబ్దాలపాటు అత్యంత కీలకనేతగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాల్‌రావు లొంగిపోయిన మరుసటి రోజే మరో 170 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ లో లొంగిపోయారని గుర్తు చేశారు. బుధవారం ఛత్తీస్‌గఢ్‌లో 27మంది, మహారాష్ట్రలో 61 మంది జనజీవన స్రవంతిలోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.
గత రెండు రోజుల వ్యవధిలో 258 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. భారత రాజ్యాంగంపై తమ విశ్వాసాన్ని ప్రకటిస్తూ హింసను త్యజించాలనే వీరి నిర్ణయాన్ని అమిత్ షా అభినందించారు. తమ విధానం స్పష్టంగా ఉందన్న అమిత్ షా లొంగిపోయేవారిని స్వాగతిస్తామని, ఇంకా తుపాకీ కొనసాగించాలనుకొనే వారు మాత్రం భద్రతా దళాల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
నక్సలిజం మార్గంలో ఇంకా కొనసాగుతున్న వారు తమ ఆయుధాలను విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని మరోసారి హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలించేందుకు తాము కట్టుబడి ఉన్నామని అమిత్ షా పునరుద్ఘాటించారు. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద స్థావరాలుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్మడ్, ఉత్తర బస్తర్లు విముక్తి పొందిన ప్రాంతాలుగా ప్రకటించడం సంతోషదాయకమని తెలిపారు.
ఇప్పుడు దక్షిణ బస్తర్‌లో నక్సలిజం ఉందని, దాన్ని భద్రతాదళాలు త్వరలో తుడిచిపెడతాయని ఆయన స్పష్టం చేశారు. కాగా ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ సర్కార్ ఏర్పాడిన తర్వాత జనవరి 2024 నుంచి 2,100 మంది మావోయిస్టులు లొంగిపోగా, 1785 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో 477 మంది ఎన్కౌంటర్లలో మరణించారని చెప్పారు.
More Stories
సత్యసాయి పోలీసుల అదుపులో మరి ఇద్దరు ఐఎస్ఐ ఉగ్రవాదులు
ఎమర్జెన్సీ నుండి రాముని వరకు దేవరస్ నేతృత్వం
సొంత ఊరికే పికె అపరిచితుడు