
కెనడాలోని సర్రేలో ఉన్న కపిల్ శర్మ ‘కాప్స్ కేఫ్’ను లక్షం చేసుకుని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సహచరులని ఆరోపణ ఉన్నవారు కాల్పులు జరిపారు. కాగా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. అయితే పదేపదే దాడులు జరుగుతున్న నేపథ్యంలో ‘కపిల్ షో’ నిర్వాహకుడి కేఫ్‌కు తీవ్రమైన భద్రతా సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈసారి జరిగిన దాడి మూడోసారి.
ఓ తుపాకీదారుడు కాల్పులు జరపడం గురువారం వీడియోలో రికార్డు అయింది. అయితే ఈ దాడి తామే చేశామని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సహచరులు కుల్వీర్ సిధు, గోల్డీ ధిల్లన్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టారు. సర్కూలేట్ అయిన వీడియోలో కేఫ్ వద్ద దుండగులు అనేకమార్లు కాల్పులు జరుపుతున్న దృశ్యం రికార్డు అయింది. దుండగులు ముసుగులేకుండా, దూకుడుగా కాల్పులు జరిపారు.
ఇది అక్కడి ప్రజా భద్రత విషయంలో ఆందోళనకరంగా ఉంది. దుండగులు తమ సామాజిక మాధ్యమ పోస్ట్‌లో ‘వాహే గురుజీ కా ఖాల్సా, వాహే గురుజీ ఫతేహ్. నేడు సర్రేలో కాప్స్ కేఫ్‌లో జరిగిన కాల్పులు జరిపింది నేనే. మా పేర్లు కుల్వీర్ సిధు, గోల్డీ ధిల్లన్. మాకు సామాన్య ప్రజలపై ఎలాంటి కక్ష లేదు. మమ్మల్ని మోసగించిన వారికి ఇదొక హెచ్చరిక. వారు మాకు బాకీ ఉన్నారు. మా మతం గురించి మాట్లాడే బాలీవుడ్ వ్యక్తులు కూడా నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. వారిపై బుల్లెట్లు ఎక్కడి నుంచైనా దిగొచ్చు’ అని పేర్కొన్నారు.
ఈ పోస్ట్‌పై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. తమ మత భావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, తమకు బాకీ ఉన్నారని పేర్కొనడంపై అధికారులు దృష్టి సారించారు. కాగా కాల్పుల్లో కిటికీ అద్దాలు మాత్రమే పగిలాయి. ఎవరికీ ఎలాంటి గాయం కాలేదు. చాలా రోజుల తర్వాత మళ్లీ మూడోసారి ఈ దాడి జరిగింది. ఇది తన వ్యాపారంపై ప్రభావం చూపుతుందని, తన సిబ్బంది భద్రతకు ఆందోళన కలిగించే విషయమని కపిల్ శర్మ పేర్కొన్నారు.
ఇంతకు ముందు జరిగిన రెండు దాడుల తర్వాత ముంబైలో కపిల్ శర్మ భద్రత విషయంలో సమీక్ష జరిగింది. కాగా ప్రస్తుతం సర్రే పోలీసులు తాజా దాడి విషయంపై దర్యాప్తు జరుపుతున్నారు. సిసిటివి ఫుటేజ్‌లను సమీక్షిస్తున్నారు. అంతేకాక సాక్షులను ప్రశ్నిస్తున్నారు.
More Stories
పాక్ సైనికుల దుస్తులతో ఆఫ్ఘన్ లో తాలిబన్ల ప్రదర్శనలు
లండన్‌లోని ట్రాఫాల్గర్ స్క్వేర్‌లో ఘనంగా దీపావళి వేడుకలు
ఐరాస మానవ హక్కుల మండలికి ఏడోసారి ఎన్నిక