విశాఖ స్టీల్ కు ఏపీ ప్రభుత్వం రూ. 2,400 కోట్ల విద్యుత్ రాయితీ!

విశాఖ స్టీల్ కు ఏపీ ప్రభుత్వం రూ. 2,400 కోట్ల విద్యుత్ రాయితీ!
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు ముందుగా  నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ కు ఆర్ధికంగా మద్దతు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.  విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన రెండు సంవత్సరాల విద్యుత్ బకాయిలను రద్దు చేశారు. ఈ మేరకు పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  ఉక్కు ఫ్యాక్టరీ నష్టాలను ఎదుర్కుంటున్న నేపథ్యంలో ఆ సంస్థకు ఆర్థిక చేయూతను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తాజా ఉత్తర్వుల ప్రకారం గత ఏడాది ఆగస్టు నుండి రెండు సంవత్సరాల పాటు విద్యుత్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు చేసిన మొత్తం బకాయిల విలువ 2,400కోట్ల రూపాయలుగా ఉత్తర్వులలో పేర్కొన్నారు.  విశాఖ ఉక్కు ప్లాంటు యాజమాన్యం నుండి అందిన పలు వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రద్దు చేసిన మొత్తాన్ని భవిష్యత్తులో ప్రభుత్వ వాటాగా బదలాయించనున్నారు.
ఈ మొత్తాన్ని 7 శాతం వడ్డీతో పదేళ్ల తర్వాత విశాఖ ఉక్కులో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా మార్చనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రూ. 753 కోట్ల బదలాయింపు ఛార్జీలు కూడా ఈ మొత్తంలోనే ఉంటాయి.  ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎపిఇపిడిసిఎల్, ఇంధన శాఖ, విశాఖ ఉక్కు సంస్థలకు ప్రభుత్వం సూచనలు చేసింది. గతంలో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కొన్ని ప్రతిపాదనలు చేసింది.
కేంద్రం తరఫున విశాఖ ఉక్కుకు తాము రూ.11,440 కోట్లు ఆర్థిక సాయం చేస్తున్నామని, రాష్ట్రం తరఫున తమకు మూడు అంశాల్లో సాయంచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కు మంత్రిత్వ శాఖ కోరింది.  అందులో భాగంగా మూడేళ్ల విద్యుత్‌,నీటి బిల్లులు మాఫీ చేయాలని ఉక్కు శాఖ కోరింది. దీనికి స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూ.2,400 కోట్ల సాయం అందిస్తామని తెలిపింది. ఇక.. రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులన్నింటికీ విశాఖ స్టీల్‌ను కొనుగోలు చేయాలని ఉక్కు మంత్రిత్వ శాఖ సూచించగా పరిశీలన చేస్తున్నారు.