బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ సర్కారుకు చుక్కెదురు

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ సర్కారుకు చుక్కెదురు
 
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ధర్మాసనం హైకోర్టుకు సూచించింది.
 
కావాలనుకుంటే పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లవచ్చని చెప్పింది. 50 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ఆదేశిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని కొట్టివేసింది. కాగా, సుప్రీంకోర్టులో సైతం సానుకూల నిర్ణయం రాకపోవటంతో పార్టీ పరంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన సహచర మంత్రులతో చర్చించి, స్థానిక ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జీవో నంబర్ 9ను జారీ చేసింది. అయితే, ఈ జీవోపై కొందరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించగా, రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించి ఉన్నాయని అలాగే సుప్రీంకోర్టు నిర్దేశించిన ‘ట్రిపుల్ టెస్ట్’ (వెనుకబాటుతనం, జనాభా వివరాలు, 50 శాతం పరిమితి) ప్రమాణాలను పాటించలేదనే కారణంతో హైకోర్టు దీనిపై స్టే విధించింది. హైకోర్టు స్టే కారణంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.

హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ జీవో నంబర్ 9 ఆధారంగా స్థానిక ఎన్నికలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పునరుద్ఘాటిస్తూ 50 శాతం రిజర్వేషన్ల పరిమితికి లోబడి మాత్రమే ఎన్నికలకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.