శ్రీశైలం మల్లన్న సేవలో ప్రధాని మోదీ

శ్రీశైలం మల్లన్న సేవలో ప్రధాని మోదీ
* శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శన
 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకై శ్రీశైలం చేరుకున్నారు. ఈ సందర్భంగా మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో కర్నూలు చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లతో కలిసి హెలికాప్టర్‌లో సున్నిపెంటకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్లారు
 
ప్రధాని మోదీకి శ్రీశైలం ఆలయంలో వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన మంత్రికి విభూతి, కుంకుమ ధరింపజేసి ప్రదక్షిణకార మార్గంలో ఆలయ అంతర్భాగానికి ఆహ్వానించారు. అనంతరం ప్రధాని మోదీ మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని మోదీ స్వామివారిని తొలిసారి దర్శించుకున్నారు.

ప్రధాన మంత్రి ధ్వజస్తంభ నమస్కారం, శివ సంకల్పం అనంతరం రత్నగర్భ గణపతి పూజ నిర్వహించారు. తరువాత మూలవిరాట్ శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి ఏకవార రుద్రాభిషేకం, బిల్వార్చన, మల్లెపూల అర్చన, మహామంగళ హారతి, మంత్ర పుష్పాలతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. పూజలు తర్వాత నందీశ్వర దర్శనం చేసుకున్నారు. 

అర్చకులు అందించిన స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పూజలో భాగంగా ప్రధాన మంత్రి మోదీకి స్వామి, అమ్మవార్ల చిత్రపటాలు, శేష వస్త్రాలు ఆలయ పూజారులు అందించారు. ఈ పర్యటనతో శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న నాలుగో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు. గతంలో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు ఈ ఆలయాన్ని సందర్శించారు. ప్రధానిగా మోదీ శ్రీశైలానికి రావడం ఇదే తొలిసారి.

ఆలయ దర్శనం తర్వాత ప్రధాని మోదీ శ్రీశైలంలో ఉన్న శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. 1677లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ క్షేత్రాన్ని సందర్శించిన దానికి గుర్తుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి ధ్యాన మందిరాన్ని, శివాజీ విగ్రహాన్ని ప్రధాని పరిశీలించారు. కేంద్రం నిర్వాహకులు దాని ప్రాముఖ్యతను మోదీకి వివరించారు. దేశభక్తి, ధర్మరక్షణకు ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజు స్ఫూర్తి కేంద్రంలోని ప్రదర్శనలపై ఆసక్తి చూపారు.

ప్రధాని వెంట చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కూడా శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు.  రాజ్ దర్బార్ గోడలపై ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర తెలిసేలా ఏర్పాటు చేసిన శిల్పాలను ప్రధాని పరిశీలించారు. అనంతరం శివాజీ విగ్రహం వద్దకు చేరుకుని దాన్ని తాకి నమస్కరించారు.  ధ్యానముద్రలో ఉన్న శివాజీతో పాటు అమ్మవారి విగ్రహాలను దర్శించుకున్న మోదీ అనంతరం పుష్పాలు సమర్పించారు. కేంద్రం నిర్వహణ పట్ల సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని, స్ఫూర్తి కేంద్ర నిర్వహణ బాగుందంటూ ట్రస్టు నిర్వాహకులను అభినందించారు. తర్వాత ప్రధాని మోదీ భ్రమరాంబ గెస్ట్‌హౌస్‌కు వెళ్లారు.