ఇప్పుడు 3 జిల్లాలకే నక్సలిజం పరిమితం

ఇప్పుడు 3 జిల్లాలకే నక్సలిజం పరిమితం
ఇప్పటివరకు ఆరు జిల్లాలో ప్రాబల్యం చాటుకున్న నక్సలిజం ఇప్పుడు కేవలం మూడు జిల్లాలకు పరిమితం అయిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. మల్లోజుల, ఆయన బృందం లొంగుబాటు తర్వాత బుధవారం ఈ స్పందన వెలువడింది. ఇప్పుడు కేవలం బీజాపూర్, సుక్మా, నారాయణ్‌పూర్ జిల్లాలో నక్సల్స్ ఉనికి ఉందని ప్రకటనలో తెలిపారు. 
వామపక్ష తీవ్రవాదం (ఎల్డబ్ల్యూఈ)  కథ ముగిసేదశకు వచ్చిందని కూడా వ్యాఖ్యానించారు.
నక్సల్స్ రహిత భారత్ రూపొందించాలనే మోదీ ప్రభుత్వ విజన్ దిశలో ఇది భారీ ముందడుగు అని, తమ 2026 లక్ష్యం ముందే దీనిని చేరుకుంటామని అధికారిక ప్రకటనలో తెలిపారు.  2013 నాటికి మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు 126 ఉండేవి. కానీ 2025 మార్చి నాటికి ఈ సంఖ్య 18 జిల్లాలకు తగ్గిపోయింది. తాజా ఈ మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 3కి పడిపోయింది’ అని కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపింది.
 
“మావోయిస్ట్ రహిత భారత్ను నిర్మించాలనే మోదీ ప్రభుత్వ దార్శనికతకు గొప్ప ముందడుగు పడింది. మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య ఇప్పుడు 6 నుంచి 3కు తగ్గింది” అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  ప్రధాని మోదీ నాయకత్వంలో, అమిత్ షా మార్గదర్శకత్వంలో తాము 2026 మార్చి 31కు ముందే అనుకున్న లక్ష్యం చేరుకుంటామని ఆ ప్రకటనలో వివరించారు. 
ఈ ఏడాది రికార్డు స్థాయిలో 312 కేడర్స్ నిర్మూలన జరిగింది. ఇందులో మావోయిస్టుల ప్రధాన కార్యదర్శి, 8 మంది వరకూ పొలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారని తెలిపారు.  దాదాపుగా 836 మంది అరెస్టు అయ్యారని, 1639 మంది లొంగుబాటు అయ్యారని లెక్కలు తెలిపారు. ఇప్పుడు మల్లోజుల లొంగుబాటుతో ఇది కీలకమ లుపు తిరిగిందని పేర్కొన్నారు.
 
ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లోని మావోయిస్టులు క్రమంగా, పెద్ద సంఖ్యలో లొంగిపోతున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్లోని సుక్మా, కాంకేర్ జిల్లాల్లో 77 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 42 మంది మహిళా కేడర్, ఇద్దరు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు ఉన్నారని అధికారులు తెలిపారు.  సుక్మా జిల్లాలో లొంగిపోయిన 27 నక్సల్స్పై రూ.50లక్షల రివార్డు ఉండడం గమనార్హం. ఇప్పటి వరకు 1,639 మంది లొంగిపోయి ప్రధాన జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఒక పొలిట్ బ్యూరో సభ్యుడు, ఒక కేంద్ర కమిటీ సభ్యుడు కూడా ఉండడం గమనార్హం.
 
దేశంలో నక్సలిజం పూర్తి స్థాయి అంతానికి తమ మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి ఆరంభం జరిగిందని, ఇది దేశ చరిత్రలో మైలురాయి అవుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గర్వంగా తెలిపారు. ఇప్పుడు ఇక చత్తీస్‌గఢ్, కొంతలో కొంత తెలంగాణలోనే మావోయిస్టుల ప్రాబల్యం ఉంది. ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో కేవలం వారి ఉనికి పరిమితం అయింది. ఇది కూడా అంతరిస్తుందని స్పష్టం చేశారు. ఇది పోలీసు, భద్రతా సిబ్బంది, ప్రత్యేకించి ఇంటెలిజెన్స్ వర్గాల ఘనత అని కొనియాడారు.