
భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తొలి మానవసహిత అంతరిక్ష మిషన్ ‘గగన్యాన్’ 2027 నాటికి సిద్ధం అవుతుందని ఇస్రో వెల్లడించింది. 2040 నాటికి సిబ్బందితో కూడిన చంద్రుడిపై తొలి యాత్ర చేపట్టాలని ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ తెలిపారు. అందుకు అనుగుణంగానే 2040 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 35వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటూ అంతరిక్ష రంగ అభివృద్ధి కోసం ప్రస్తుతం ఇస్రో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. 2026లో వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి పంపడం, 2035 నాటికి జాతీయ అంతరిక్ష కేంద్రం, వాటిలో 80వేల కేజీలను మోసుకెళ్లే రాకెట్లను తయారుచేయడం, చంద్రుడిపై అధ్యయనం కోసం వీనస్ ఆర్బిటర్ మిషన్ (విఓఎం) ఏర్పాటు వంటి లక్ష్యాలను ఏర్పరుచుకున్నామని తెలిపారు.
అంతరిక్ష మిషన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్ బిగ్ డేటా వంటివాటిని ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. చంద్రుడి ఉపరితల నమూనాలను భూమికి తీసుకొచ్చేందుకు 2027లో ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-4 ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ వెల్లడించారు.
“2040 నాటికి స్వదేశీ సిబ్బందితో చంద్రుడిపై మిషన్ పూర్తి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకాలు ఇచ్చారు. దీని ద్వారా మన పౌరులను చంద్రుడిపైకి దింపి సురక్షితంగా తిరిగి తీసుకురావాలి. మోదీ స్పష్టమైన రోడ్‌మ్యాప్‌తో అంతరిక్ష రంగానికి సంస్కరణలు ప్రవేశపెట్టారు. భారతీయ అంతరిక్ష కేంద్రం (బిఎఎస్) 2035 నాటికి అందుబాటులోకి వస్తుంది” అని తెలిపారు.
“అంతరిక్షంలో ప్రారంభ మాడ్యూల్స్ 2027 నాటికి అందుబాటులోకి వస్తాయి. కొన్ని సంవత్సరాల క్రితం అంతరిక్ష రంగంలో కేవలం ఒకటి లేదా రెండు స్టార్టప్‌లు మాత్రమే ఉండేవి. కానీ, ఈరోజు ఉపగ్రహ తయారీ, ప్రయోగ సేవలు, అంతరిక్ష ఆధారిత డేటా విశ్లేషణలపై 300 కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు” అని గుర్తు చేశారు.
“వ్యవసాయం, విపత్తు ప్రతిస్పందన, నిర్వహణ, టెలికమ్యూనికేషన్, రియల్-టైమ్ రైలు, వాహన పర్యవేక్షణలో ఉపగ్రహ ఆధారిత అనువర్తనాల అధ్యయనానికి ఇవి ఉపయోగపడతాయి. 35 సంవత్సరాల క్రితం కంప్యూటర్ విప్లవాన్ని ఎవరూ ఊహించనట్లుగా, అలాగే ఏఐ, రోబోటిక్స్ అంతరిక్ష పరిశోధన తదుపరి యుగాన్ని నిర్వచిస్తాయి” అని నారాయణన్ వివరించారు.
సాంకేతిక, వ్యూహాత్మక ప్రాధాన్యాల ఆధారంగా అంతర్జాతీయ సహకారాన్ని భారత్ అంగీకరిస్తుందని తెలిపారు. సుమారు 34 వివిధ దేశాలకు చెందిన 433 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించిందని వెల్లడించారు. ఇప్పటికే చేపట్టిన ఆదిత్య ఎల్ 1 మిషన్ అంతరిక్ష వాతావరణంపై లోతైన అధ్యయనాన్ని, సౌర డేటాను అందించిందని వివరించారు. చంద్రుడిపై నీటిని కనిపెట్టడంతో పాటు దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా రికార్డ్ సాధించామని తెలిపారు. దాదాపు 9 విభాగాల్లో ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారేందుకు అంతరిక్ష కార్యక్రమంలో ఈ యాత్ర కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు.
More Stories
రెడ్లు బిసి మంత్రి సురేఖను అణచే కుట్ర… కుమార్తె ఆరోపణ
`జై శ్రీరామ్’ నినాదంతో ముస్లిం పోలీస్ అధికారిణి!
ఇప్పుడు 3 జిల్లాలకే నక్సలిజం పరిమితం