
భారత్, ఏపీ వేగం, సామర్థ్యాన్ని యావత్ ప్రపంచం గమనిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 16 నెలల్లో కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి డబుల్ ఇంజిన్‌లా దూసుకుపోతోందని కొనియాడారు. కర్నూలు జిల్లాలోని నన్నూరులో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్’ బహిరంగసభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ఏపీ అభివృద్ధి కోసం ఢిల్లీ, అమరావతి కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు.
ఏపీ ఆత్మగౌరవం సంస్కృతికి నిలయంగా ఉందని, ఏపీలో అనంత అవకాశాలు ఉన్నాయని ఉద్ఘాటించారు. సైన్స్ అండ్ టెక్నాలజీలోనూ యువశక్తి ఉందని నొక్కిచెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూపంలో ఏపీకి శక్తివంతమైన నాయకత్వం ఉందని ప్రధాని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏపీకి సహకారం అందిస్తున్నామని భరోసా ఇచ్చారు.
“భారత్, ఏపీ వేగం, సామర్థ్యాన్ని యావత్ ప్రపంచం గమనిస్తోంది. గూగుల్ ఏఐ డేటా సెంటర్ ద్వారా సబ్ సీ గేట్‌వేగా మారుతుంది. ఈ ప్రాజెక్టు విశాఖను ఏఐ, కనెక్టివిటీ హబ్‌గా మారుస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్‌తో పాటు యావత్ ప్రపంచానికి సేవలు. భారత్ అభివృద్ధికి ఏపీ అభివృద్ధి చాలా అవసరం. అలాగే ఏపీ అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి అంతే అవసరం. ఈ ప్రాజెక్టులు రాయలసీమలోని ప్రతి జిల్లాలో ఉద్యోగాలు సృష్టిస్తాయి” అని ప్రధాని తెలిపారు.
ప్రస్తుతం చేబడుతున్న ప్రాజెక్టులు రాయలసీమ ప్రగతికి సరికొత్త ద్వారాలు తెరిపిస్తాయని, ప్రాజెక్టులతో పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంతమవుతుంని, ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లతో మరిన్ని ఉపాధి అవకాశాలని ప్రధాని తెలిపారు.
‘2047 నాటికి మన దేశం వికసిత్ భారత్‌గా మారుతుంది. 21వ శతాబ్దం 140 కోట్ల భారతీయుల శతాబ్దం. పలు ప్రాజెక్టులతో ఏపీలో కనెక్టివిటీ బలోపేతం అవుతుంది. ప్రాజెక్టులతో పరిశ్రమలకు ఊతం ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. దేశం అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత కీలకం. ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులతో దేశ ఇంధన సామర్థ్యం పెరుగుతుంది” అని ప్రధాని మోదీ భరోసా వ్యక్తం చేశారు.
“దేశంలోని ప్రతి గ్రామంలో విద్యుద్దీకరణ జరిగింది. తలసరి విద్యుత్ వినియోగం 1400 యూనిట్లకు పెరిగింది. ఇళ్లతో పాటు పరిశ్రమలకు తగిన విద్యుత్ అందుతోంది. సహజ వాయువు పైప్‌లైన్‌తో 15 లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా. చిత్తూరు ఎల్‌పీజీ బాటిలింగ్ ప్లాంటుకు రోజూ 20 వేల సిలిండర్లు నింపే సామర్థ్యం ఉంది” అని ప్రధాని స్పష్టం చేశారు.
“వికసిత్ భారత్ లక్ష్యం సాధనకు మల్టీమోడల్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల అభివృద్ధి. సబ్బవరం-షీలానగర్ హైవేతో కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఈ సంకల్పానికి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యం మరింత శక్తినిస్తుంది” అని ప్రధాని తెలిపారు.
“నిమ్మలూరులో నైట్ విజన్ పరిశ్రమ రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ సాధనకు దోహదం. ఇక్కడి పరికరాలు రక్షణ రంగ ఎగుమతులను సరికొత్త శిఖరాలకు చేరుస్తాయి. రక్షణ రంగ శక్తి ఏంటో ఆపరేషన్ సిందూర్ ద్వారా అందరం చూశాం. కర్నూలును దేశ డ్రోన్ హబ్‌గా చేయాలని ఏపీ సంకల్పించింది. డ్రోన్ రంగంలో కర్నూలు దేశానికి గర్వకారణంగా నిలవనుంది. సంస్కరణలతో ప్రజల జీవితాలను సులభతరం చేయడమే సంకల్పం. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ప్రచారాన్ని విజయవంతం చేశారు. ఓకల్ ఫర్ లోకల్ సంకల్పంతో తయారీ రంగాన్ని ప్రోత్సహించాలి. వికసిత్ ఆంధ్రప్రదేశ్‌తోనే వికసిత్ భారత్ కల నెరవేరుతుంది” అని ప్రధాని మోదీ తెలిపారు.
మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు ప్రధాని మోదీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. 21వ శతాబ్దం మోదీకి చెందుతుందనడంలో సందేహం లేదని చెబుతూ సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు ప్రధాని మోదీ అని కొనియాడారు. మోదీ వంటి నాయకుడిని పొందడం దేశం ఎంతో అదృష్టం చేసుకుందని చెప్పారు. చాలా మంది ప్రధానులతో పని చేసినా మోదీ వంటి నాయకుడిని చూడలేదని స్పష్టం చేశారు. ఎలాంటి విశ్రాంతి లేకుండా నిరంతరం మోదీ పని చేస్తూనే ఉన్నారని తెలిపారు.
తొలుత రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన, నిర్మించబోతున్న రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రధాన మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా పనిచేస్తున్న ప్రధాని మోదీని కర్మయోగి అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొనియాడారు. ప్రధాని మోదీ దేశం తలెత్తి చూసే విధంగా ఆత్మనిర్భర్ భారత్ తీసుకువచ్చారని గుర్తు చేశారు. ప్రతి కుటుంబానికి పన్నుల భారాన్ని తగ్గించారని వివరించారు. దేశ జెండా ఎంత పొగరుగా ఉంటుందో, అలాగే దేశ పటాన్ని ప్రపంచపటంలో నిలబెట్టారన్నారు.
More Stories
శ్రీశైలం మల్లన్న సేవలో ప్రధాని మోదీ
విశాఖ స్టీల్ కు ఏపీ ప్రభుత్వం రూ. 2,400 కోట్ల విద్యుత్ రాయితీ!
రెడ్లు బిసి మంత్రి సురేఖను అణచే కుట్ర… కుమార్తె ఆరోపణ