మళ్లీ భగ్గుమన్న పాక్‌-అఫ్ఘాన్‌ సరిహద్దు.. కాల్పుల విరమణ

మళ్లీ భగ్గుమన్న పాక్‌-అఫ్ఘాన్‌ సరిహద్దు.. కాల్పుల విరమణ

అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబన్‌ ప్రభుత్వానికి, పాకిస్థాన్‌ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. సరిహద్దుల్లో ఇరుదేశాల బలగాల మధ్య బుధవారం భీకర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తెల్లవారుజామున జరిగిన కాల్పుల పోరులో డజన్ల సంఖ్యలో మరణాలు చోటుచేసుకోగా పలువురు గాయపడ్డారు.  తాలిబన్‌ సైనిక స్థావరాలపై దాడి చేసేందుకు పాక్‌ సైన్యం ఉపయోగించిన యుద్ధ ట్యాంకును స్వాధీనం చేసుకున్న అఫ్ఘాన్‌ సైన్యం పాక్‌ సైనిక ఔట్‌పోస్టుపై దాడి చేసినటు ్ల వార్తలు వచ్చాయి. పాకిస్థాన్‌లోని చమన్‌ జిల్లా, అఫ్ఘాన్‌లోని బోల్దక్‌ జిల్లాలో ఉభయ దేశాలకు చెందిన సైనిక దళాలు పరస్పరం దాడులకు తెగపడ్డాయి.

మంగళవారం అర్ధరాత్రి నుంచి జరుగుతున్న కాల్పులలో 58 మంది పాక్‌ సైనికులు మరణించినట్లు అఫ్గాన్‌ వెల్లడించగా పాక్‌ మాత్రం 200 మందికిపైగా అఫ్ఘాన్‌ సైనికులు మరణించారని, తమ సైనికులు 23 మంది మరణించారని తెలిపింది. అఫ్ఘాన్‌లోని కాందహార్‌ ప్రావిన్సు, పాక్‌లోని బలోచిస్థాన్‌ ప్రాంతం మధ్య ఉన్న కీలక సరిహద్దు జిల్లా స్పిన్‌ బోల్దక్‌లో పాక్‌ సైన్యం జరిపిన దాడులలో 12 మంది మరణించగా 100 మందికిపైగా గాయపడ్డారని అఫ్ఘాన్‌కు చెందిన తాలిబన్‌ తెలిపింది. 

 
కాగా, కాబుల్‌లోని తెహ్రీక్‌-ఎ-తాలిబన్‌ పాకిస్థాన్‌(టీటీపీ) శిబిరాలపై పాక్‌ గత వారం దాడులు చేయడంతో రెండు దేశాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. తాలిబన్‌ విదేశాంగ మంత్రి భారత్‌ను తొలిసారి సందర్శించి భారత్‌తో దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకున్న తరుణంలో అఫ్ఘాన్‌పై పాక్‌ దాడులు జరపడం గమనార్హం అఫ్ఘాన్‌, పాకిస్థాన్‌ మధ్య ఘర్షణలకు తాత్కాలికంగా తెరపడింది. 48 గంటల పాటు కాల్పుల విరమణ పాటించాలని రెండు దేశాలు నిర్ణయించాయి.
తాజా ఘర్షణలతో రెండు దేశాల సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు పాక్‌ చర్చల ప్రక్రియ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకు తాత్కాలికంగా 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్నట్లు పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఒకనాటి మిత్రులైన పాక్‌, అఫ్ఘాన్‌ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడం, చర్చల కోసం పాక్‌ మంత్రులు తమ దేశంలోకి ప్రవేశించడానికి అఫ్ఘాన్‌ అనుమతించకపోవడంతో మధ్యవర్తిత్వం వహించాలని పాక్‌ ప్రభుత్వం ఖతార్‌, సౌదీ అరేబియాకు అంతకుముందు విజ్ఞప్తి చేసింది.

అయితే ముందుగా ఎవరు కాల్పులు జరిపారనే విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే అఫ్గాన్‌ సైన్యం తమపై దాడి చేసిందని పాకిస్థాన్‌ సైన్యం ఆరోపిస్తోంది. అఫ్గాన్‌ సైన్యం, తెహ్రీక్‌–ఇ–తాలిబాన్‌ (టిటిపి) ఉగ్రవాదులు కలిసి పాకిస్థాన్‌ భూభాగంలోని సైనిక పోస్టులపై కాల్పులు జరిపారని పాక్‌ సైనిక వర్గాలు వెల్లడించాయి. బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని నాలుగు ప్రాంతాలపై అఫ్గాన్‌ బలగాలు దాడులు చేసినట్లు పాక్‌ పేర్కొంది. 

తమ సైన్యం వీటన్నింటినీ విజయవంతంగా తిప్పికొట్టిందని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అఫ్గాన్‌ తాలిబన్‌, టిటిపి ఉగ్రవాదులు పౌర నివాసాలపై దాడులకు తెగబడినట్లు వెల్లడించింది. ఇరుదేశాల మధ్య ఉన్న పాక్‌–అఫ్గాన్‌ స్నేహ ద్వారాన్ని కూడా తాలిబన్లు ధ్వంసం చేశారని ఆరోపించింది. దాడులకు తమ దళాలు సమర్థవంతంగా ప్రతిస్పందించాయని, తాలిబన్‌ బలగాల ట్యాంకులు, సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని పాక్‌ సైన్యం ప్రకటించింది. ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కుర్రం ప్రాంతంలో కూడా కాల్పులు కొనసాగుతున్నాయని పాక్‌ తెలిపింది.

ఇక అఫ్గానిస్థాన్‌ కూడా ఈ ఘర్షణలను ధ్రువీకరించింది. పాక్‌ సైన్యం కాందహార్‌ ప్రావిన్స్‌లోని స్పిన్‌ బొల్దాక్‌ ప్రాంతంపై భారీ దాడులు జరిపిందని తాలిబన్‌ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. తమ దాడుల్లో పాక్‌ సైనిక పోస్టులు ధ్వంసమయ్యాయని, పాక్‌ దళాలకు చెందిన ఆయుధాలు, ట్యాంకులు స్వాధీనం చేసుకున్నామని ముజాహిద్‌ పేర్కొన్నారు.

కాగా, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను నివారించేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని జమైత్‌ ఉలేమా–ఇ–ఇస్లాం (ఫజ్ల్‌) పార్టీ ప్రకటించింది. గతంలో పాక్‌–అఫ్గాన్‌ వివాదాలను సద్దుమణగడానికి తాము సహకరించామని, మళ్లీ ఇరుపక్షాలతో చర్చలు జరుపుతున్నట్లు జేయుఐ-ఎఫ్ చీఫ్‌ మౌలానా ఫజ్లుర్‌ రెహమాన్‌ తెలిపారు. ఇరుదేశాలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు.