లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేత, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్‌ను మహారాష్ట్ర పోలీసులు బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కూడా పాల్గొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ఒక్కొక్కరిగా వచ్చి తమ ఆయుధాలను ముఖ్యమంత్రికి సమర్పించారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయిన వారికి సీఎం భారత రాజ్యాంగం ప్రతులు అందజేశారు.
వారి నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ప్రధాన స్రవంతిలోకి ఫడణవీస్ ఆహ్వానించారు. 40 ఏళ్లుగా మావోయిస్టులతో ప్రభావితమైన గడ్చిరోలీలో నక్సలిజాన్ని అంతం చేసే ప్రక్రియ మొదలైందని ఫడణవీస్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వేణుగోపాల్ అలియాస్ భూపతి లొంగుబాటు ఇందులో కీలకమన్న సీఎం, 40 ఏళ్ల క్రితం గడ్చిరోలీలో అహేరీ సిరోంచాను ప్రారంభించిన వారిలో ఆయన కూడా ఒకరని గుర్తుచేశారు. అహేరీ సిరోంచాకు భూపతి, మేధోపరమైన మద్దతు లాజిస్టిక్‌లను అందించారని వివరించారు.
మల్లోజుల తన వద్ద ఉన్న ఆయుధాన్ని సీఎం ఫడ్నవీస్‌కు అప్పగించగా, ఆయనతోపాటు సుమారు 60 మంది నక్సలైట్లు తమ వద్ద ఉన్న ఆయుధాలను ఇవాళ గడ్చిరోలి పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రంలో సీఎం ఫడ్నవీస్‌కు అప్పగించారు. నక్సల్ కమాండర్ మల్లోజులపై ఆరు కోట్ల నజరానా ఉన్న విషయం తెలిసిందే. ఆ ఆయుధాల్లో ఏడు ఏకే-47, తొమ్మిది ఇన్సాస్ రైఫిళ్లు ఉన్నాయి. మావోయిస్టుల్లో భూపతి అలియాస్ సోనూను అత్యంత ప్రభావిత వ్యూహాకర్తగా భావించేవారు. మహారాష్ట్ర-చత్తీస్ఘడ్ బోర్డర్లో అనేక దళాలను ఆయన నడిపించారు.
“మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి 60 మంది నక్సలైట్లతో కలిసి లొంగిపోయారు. ఈయన నక్సలైట్లను నియమించడం, దాడులకు ప్రణాళికలు రచించేవారు. గత నెల రోజులుగా ఆయనను జనజీవన స్రవంతిలోకి రావాలని మా పోలీసులు మాట్లాడారు. ఆయన కూడా అగ్రనాయకత్వం నక్సల్ వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని చెప్పి లొంగిపోయారు” అని ఫడ్నవిస్ తెలిపారు.
దీనితో మహారాష్ట్రలో నక్సలిజానికి వెన్నుముక విరిగిపోయిందని, దీని తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న నక్సలైట్లు కూడా లొంగిపోయేందుకు చూస్తారని చెబుతూ ఈ సందర్భంగా గడ్చిరోలి పోలీసులకు రూ. కోటి నజరానాను ముఖ్యమంత్రి ప్రకటించారు. మావోయిస్టు అగ్రనేత సహా 60 మంది లొంగిపోవడంపై ఛత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ స్పందించారు. “61మంది నక్సలైట్లు లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలిసిపోవాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో చేసిన కృషికి ఫలితంగానే నక్సలిజం అంతం కాబోతుంది. ఆ ప్రక్రియలో ఇదో కీలక మైలురాయి.” అని ఆయన తెలిపారు.

More Stories
మొహియుద్దీన్ నగర్‌ను మోహన్‌నగర్‌గా మారుస్తాం
బిహార్ ప్రచారంలో రాహుల్ వ్యాఖ్యలపై మరో వివాదం
7న సామూహికంగా వందేమాతరం ఆలాపన