కొండా సురేఖకు తెలియకుండానే ఆమె ఓఎస్డీ తొలగింపు!

కొండా సురేఖకు తెలియకుండానే ఆమె ఓఎస్డీ తొలగింపు!
రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రుల మధ్య కుమ్ములాటలు పరాకాష్టకు చేరుకొంటున్నాయి. కొండా సురేఖ, వరంగల్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య కొంతకాలంగా విభేదాలు సాగుతూ, ఇద్దరూ బహిరంగంగా విమర్శలకు దిగుతున్న సమయంలో సురేఖ ఓఎస్డీని ఆమెకు తెలియకుండానే అవినీతి ఆరోపణలతో మంగళవారం రాత్రి తొలగించడం దుమారం రేపుతోంది.
 
ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి తనకు తెలియకుండానే తన మంత్రుత్వ శాఖకు సంబంధించి మేడారం జాతర పనులను తన సన్నిహితులకు కేటాయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన సునీత, ఈ విషయమై పార్టీ అధిష్టానంకు నేరుగా ఫిర్యాదు చేశారు. దానితో మంత్రుల మధ్య కుమ్ములాటలు పార్టీ అధిష్టానం వరకు వెళ్లడంతో రేవంత్ రెడ్డి సహితం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన్నట్లు తెలుస్తున్నది.
 
అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న ఎన్. సుమంత్‌ను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ఆయనపై పలు తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. పీసీబీలో ఓఎస్‌డ్డీ నియమితులైన సుమంత్ డిప్యుటేషన్‌పై మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్నారు. 
 
సుమంత్ ప్రభుత్వ వవిషయాలలో జోక్యం చేసుకుంటున్నారని, అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడం, కాలుష్యకారక పరిశ్రమలకు సంబంధించిన కీలక నిర్ణయాలలో నేరుగా జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. సుమంత్ కార్యకలాపాలపై కొందరు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఫిర్యాదులు చేసినట్లు చెబుతున్నారు. మంత్రి పేషీలో జరిగిన ఒక ముఖ్య సంఘటన కూడా సుమంత్ తొలగింపునకు దారితీసినట్లు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన మేడారం జాతర పనులకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.  ఈ ఫిర్యాదుకు సంబంధించిన నోట్‌ను మంత్రి పీఆర్వోనే మీడియాకు పంపారు. ఈ వివాదంలో ఓఎస్డీ సుమంత్ నేరుగా ఇంజినీర్లతో మాట్లాడి ఒత్తిడి చేసిన అంశం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు చెబుతున్నారు. 
మంత్రి పేషీలలో జరుగుతున్న అనవసర జోక్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.  అయితే, ఏ మంత్రివద్ద అయినా ఓఎస్డీగా పనిచేస్తున్నవారు ఆయా మంత్రుల ఆదేశాల మేరకే అధికారులకు సమాచారం ఇస్తుండటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. పొంగులేటి వ్యవహారంలో కొండా సురేఖను కట్టడి చేసేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చర్యకు పూనుకున్నట్లు భావిస్తున్నారు.