ముగ్గురు కాళేశ్వరం ఇంజినీర్ల రూ. 400 కోట్ల ఆస్తులు సీజ్!

ముగ్గురు కాళేశ్వరం ఇంజినీర్ల రూ. 400 కోట్ల ఆస్తులు సీజ్!
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆదాయానికి మించిన ఆస్తుల కూడబెట్టారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ప్రభుత్వం ఇంజినీర్లపై తగు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇటీవల గజ్వేల్‌ ఈఎన్‌సీ, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్‌ ఎండీగా పనిచేసిన భూక్యా హరిరాం, ఎగ్జిక్యూటివ్ ఇంజిరీన్ నూనె శ్రీధర్, మాజీ ఈఎన్సీ మురళీధర్ ఇళ్లల్లో జరిపిన ఏసీబీ దాడులలో రూ. 400 కోట్ల మేరకు అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. 
 
తాజాగా ఈ ఇంజినీర్లకు విజిలెన్స్ శాఖ వీరికి సంబంధించిన ఆస్తులను నిషేధిత జాబితాలోకి చేరింది. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ దాదాపు రూ. 400 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో వీరు బెయిల్‌పై ఉన్నారు. అయితే కోర్టులో ఈ కేసు తేలే వరకు నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తుల విషయంలో ఎలాంటి క్రయవిక్రయాలు జరపకూడదు. 
 
ఈ ఇంజినీర్ల అవినీతి ఆస్తుల చిట్టాతో ఏసీబీ డైరెక్టర్‌ నీటి పారుదల శాఖకు లేఖ రాశారు. దీంతో వారి అక్రమ ఆస్తులను జప్తు చేయాలని నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీనికి విజిలెన్స్‌ కమిషన్‌ సమ్మతించింది.
 
నీటి పారుదల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేసిన నూనె శ్రీధర్ ఇల్లు, బంధువుల ఇళ్లపై గతంలో ఎసిబి జరిపిన దాడులలో రూ. 110 కోట్లకు పైగా అక్రమాస్తులను కూడబెట్టిన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీధర్, ఆయన భార్య, కుమారుడు, కుమార్తె, బినామీల పేరు మీద గల ఆస్తులను గుర్తించారు. అనంతరం అవినీతి నిరోధక శాఖ నూనె శ్రీధర్‌పై కేసు నమోదు చేసింది. అనంతరం ఆయన జూన్‌లో అరెస్టయ్యారు.

ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చీఫ్‌ ఇంజినీరుగా కీలక బాధ్యతలు నిర్వహించారు భూక్యా హరిరాంను గత మేలో అరెస్ట్ చేశారు. అప్పటికి హరిరాం గజ్వేల్‌ ఈఎన్సీగా, కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి నిధులు సమకూర్చిన కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు ఎండీగా ఉన్నారు. అరెస్టు తర్వాత ఆయన్ను నీటిపారుదల శాఖ సస్పెండ్‌ చేసింది. 
 
మరోవైపు నీటిపారుదల చీఫ్ ఇంజనీర్ గా పనిచేసి రిటైర్ అయిన మురళీధర్ కు  సంబంధించిన ఆస్తులపై జులైలో ఎసిబి జేర్పిన దాడులలో రూ. 100 కోట్ల మేరకు గల అక్రమాస్తులను గుర్తించారు. దానితో కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.