రాహుల్ గాంధీకి సుప్రీంలో చుక్కెదురు

రాహుల్ గాంధీకి సుప్రీంలో చుక్కెదురు
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గొత కొద్ది కాలంగా అధికార బీజేపీ ఓట్ చోరీకి పాల్పడుతోందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎన్నికల సంఘంతో కలిసి ఓట్లను చోరీ చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అయితే ఈ పిల్‌ను సుప్రీం తోసిపుచ్చింది. 
 
ఈ మేరకు పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాలా బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారించేందుకు నిరాకరించింది. ఈ విషయంలో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. ఫిర్యాదు చేసినా ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, పిటిషనర్‌ సుప్రీం కోర్టు ధర్మాసనానికి తెలియజేశారు. 
దీనిపై స్పందించిన ధర్మాసనం రాజకీయ అంశాలకు కోర్టులను వేదిక చేయవద్దని, ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని స్పష్టం చేసింది.
కాగా, ఎలక్టోరల్ రోల్స్‌లో అనేక అవకతవకలు జరిగాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. దాని వల్ల రాజ్యాంగబద్ధమైన, స్వేచ్ఛాయుతమైన ఎన్నికలకు విఘాతం కలిగిందని పిటిషనర్ వాదించారు.  బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ సీటులోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో వేలాది నకిలీ, చెల్లని, కల్పిత ఎంట్రీలు గుర్తించబడ్డాయని ఆరోపించారు. ఇది ఒక వ్యక్తి, ఒక ఓటు అనే సూత్రాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. 
రాహుల్ గాంధీ ఇటీవల  బిజెపి, ఎన్నికల కమిషన్ కలిసి దేశంలో ఓట్ చోరీకి పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు.  అంతేకాకుండా ఇలా చోరీ చేసిన ఓట్లతోనే ఎన్డీఏ సర్కార్ ఏర్పడిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓట్ల దొంగతనానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇక కొందరు వ్యాపారవేత్తలకు ప్రయోజనం కలిగించేందుకు ప్రజల ఓటు హక్కును చోరీ చేయాడనికి బీజేపీ ప్రయత్నిస్తోందంటూ  ధ్వజమెత్తారు. త్వరలో బిహార్‌‌లో జరగబోయే ఎన్నికల్లోనూ ఇలాగే ఓట్లు దొంగిలించడానికి కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.
 
ఓటు చోరీ చేయడంలో మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలలో ఎన్డీయే కూటమి విజయవంతం అయిందని పేర్కొంటూ, అయితే  బిహార్‌లో మాత్రం బీజేపీ, ఎన్నికల సంఘాన్ని ఒక్క ఓటు కూడా దొంగిలించబోనివ్వమి స్పష్టం చేశారు.  పైగా, సెంట్రల్ సాఫ్ట్‌వేర్ సాయంతో లక్షల మంది పౌరుల పేర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించాలని ఆరోపించారు. ఈ ఆరోపణలు అన్నింటినీ తాను 100 శాతం ఆధారాలతో చేస్తున్నానని  వెల్లడించారు. అయితే రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోరీ ఆరోపణలను ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడూ ఖండిస్తోంది.