
ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అదేస్థాయిలో లొంగిపోతున్నారు. ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటి వరకు 1040 మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి లొంగిపోయారు. ఒక్క ఏడాదిలో లొంగిపోయిన మావోయిస్టుల సంఖ్య ఇదే అత్యధికం కావటం గమనార్హం. గతేడాది ఈ సంఖ్య 881గా ఉన్నది.
గత రెండేండ్లలో లొంగిపోయిన మావోయిస్టుల సంఖ్య అనూహ్య పెరుగుదలను చూసింది. 2020లో 344 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 2021లో ఈ సంఖ్య 544గా, 2022లో 417గా, 2023లో 414గా ఉన్నది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇప్పటికే దేశంలో మావోయిస్టులను సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఉన్నది. వచ్చే ఏడాది మార్చి 31ని ఇందుకు డెడ్‌లైన్‌గా విధించుకున్నది.
ఈ గడువు దగ్గర పడటానికి దాదాపు ఆరు నెలల సమయం మాత్రమే మిగిలి ఉన్నది. కాబట్టి 2025 ముగింపు నాటికి మావోయిస్టుల లొంగుబాటు రికార్డు స్థాయిలో ఉండొచ్చని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వారంలో మధ్యస్థ స్థాయి నుంచి సీనియర్ స్థాయి క్యాడర్ వరకు మరరో రౌండ్ లొంగుబాటు జరుగుతుందని తాము ఆశిస్తున్నట్టు కేంద్ర సాయుధ పోలీసు దళాల అధికారులు చెప్తున్నారు.
నవంబర్ 1న జరిగే రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు హాజరు కావడానికి ప్రధాని మోదీ ఛత్తీస్‌గఢ్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ లొంగుబాటు జరగనున్నదని తెలుస్తున్నది. ఈనెల 8న తమపై మొత్తం రూ.48 లక్షల రివార్డును కలిగి ఉన్న 16 మంది మావోయిస్టులు నారాయణ్‌పూర్ జిల్లా పోలీసుల ముందు లొంగిపోయారు.
ఇక గడువుకు ముందే ఛత్తీస్‌గఢ్ వార్షిక డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్(డీజీపీ), ఇన్‌స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ)ల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్నది. గత ఏడాది ఈ సమావేశం ఒడిశాలో జరిగింది. ఈ ఏడాది వార్షిక సమావేశం నవంబర్ 28-30 మధ్య నయా రాయ్ పూర్‌లో జరిగే అవకాశం ఉన్నది. కేంద్ర హౌంమంత్రి ఈ 60వ సదస్సునను ప్రారంభించే అవకాశం ఉన్నప్పటికీ, రెండో రోజు కార్యక్రమంలో ప్రధాని మోదీ కూడా పాల్గొని పోలీసు ఉన్నతాధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఛత్తీస్‌గఢ్‌లోని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
More Stories
కరూర్ తొక్కిసలాటపై సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశం
మూడో తరగతి నుంచే ఏఐ!
వాట్సప్ లేకపోతేనేం.. అరట్టై వాడండి