లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల

లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల
 
నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) అగ్ర నాయకుడు, దాని సైద్ధాంతిక దళానికి, దక్షిణ బస్తర్‌లో దాని కమ్యూనికేషన్లు, ప్రజల సంబంధాలకు కీలకమైన నేత  మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను (70), మరో 60 మందితో పాటు పోలీసుల ముందు లొంగిపోవడంతో వారికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో వారు పోలీసుల ముందు సోమవారం రాత్రి లొంగిపోయినట్లు మంగళవారం ప్రకటించారు. 
 
పొలిట్‌బ్యూరో, సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడు, ఛత్తీస్‌గఢ్ అడవుల వెలుపల ప్రపంచానికి అనుసంధానించే దారంగా పిలువబడే సోను. తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన బి.కామ్ గ్రాడ్యుయేట్. 2011లో హత్యకు గురైన మావోయిస్టు నాయకుడు మల్లోజుల కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్ జీ సోదరుడు. “సోను, ఇతరులు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్,  పీపుల్స్ వార్ గ్రూప్ నుండి ప్రేరణ పొందారు” అని నిఘా వర్గాలు తెలిపాయి.
 
మావోయిస్టు పార్టీలో సైద్ధాంతిక విభజన వరుసగా లేఖల రూపంలో వెలుగులోకి వచ్చిన తర్వాత సోను లొంగిపోవడం జరిగింది. సెప్టెంబర్‌లో, సోను ఆయుధాలు వదులుకోవాలనే తన ఉద్దేశ్యాన్ని సూచిస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తదనంతరం అతను లొంగిపోవాలనే తన నిర్ణయానికి ఛత్తీస్‌గఢ్, ఇతర ప్రాంతాల నుండి గణనీయమైన సంఖ్యలో మావోయిస్టు కార్యకర్తల మద్దతును పొందాడు.
 
మావోయిస్టు పార్టీకి ఆయన 22 పేజీలతో కూడిన సుదీర్ఘ లేఖను ఈ నెల 6వ తేదీన విడుదల చేశారు. మావోయిస్టు పార్టీలో తీవ్రమైన అంతర్గత సంక్షోభం ఉన్నదని, ఆయుధ పోరాటాలను తాతాలికంగా విరమించాలని ఆ లేఖలో కోరారు. దశాబ్దాల తరబడి తప్పుడు విధానాలే తీవ్రమైన నష్టాలకు కారణమని, ‘సైన్యం తప్ప రహస్య పార్టీ లేదు’ అని ఆయన ఖరాకండిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాతాలికంగా సాయుధ పోరాటాన్ని విరమించి, ప్రజల మధ్యకు బహిరంగంగా వెళ్లాలని ఆయన క్యాడర్‌ను కోరారు.

తాను కేంద్ర కమిటీలో 28 ఏండ్లు, పొలిట్‌ బ్యూరోలో 18 ఏండ్లు సభ్యుడిగా ఉన్నట్టు మల్లోజుల తెలిపారు. ప్రస్తుతం ఉద్యమం ఎదురొంటున్న వైఫల్యాలకు, భారీ నష్టాలకు నైతిక బాధ్యత వహిస్తూ, యావత్‌ పార్టీ క్యాడర్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఇంతటి నష్టాలకు దారితీసిన నాయకత్వంలో కొనసాగడానికి అనర్హుడిని అని ప్రకటించారు.  గతంలో దివంగత ప్రధానకార్యదర్శి కామ్రేడ్‌ బసవరాజు (నంబాల కేశవరావు) కూడా ప్రభుత్వంతో శాంతి చర్చల ప్రక్రియను ప్రారంభించారని, ఏప్రిల్‌ 2025 నాటికి ఈ నిర్ణయం అనివార్యమని భావించారని గుర్తు చేశారు.

సోను మొదటి లేఖను పార్టీ శ్రేణులు విస్తృతంగా చర్చించాయి, విమర్శించారు.  పార్టీ కేంద్ర కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీలోని ఒక విభాగం అతని విధానాన్ని ఖండించాయి. అతన్ని “దేశద్రోహి” అని కూడా పిలిచాయి. తదుపరి లేఖ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రతినిధి జగన్ సెప్టెంబర్ 19న రాసిన లేఖకు ప్రతిస్పందనగా కనిపించింది.  ఇది సాయుధ పోరాటాన్ని కొనసాగించాలని సూచించింది. ఈ లొంగిపోవడాన్ని చట్టం అమలు జరిపే వ్యవస్థలకు ఒక పెద్ద విజయంగా అధికారులు అభివర్ణించారు.

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా చాలా కాలంగా మావోయిస్టు కార్యకలాపాలకు నిలయంగా ఉంది. ఇది నేటి లొంగుబాటును భారతదేశం అంతర్గత తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా మార్చింది. సోనును 2010లో సిపిఐ(మావోయిస్ట్) ప్రతినిధిగా నియమించారు. అతనికి అభయ్, భూపతి, వివేక్, రాజన్ వంటి అనేక ఇతర మారుపేర్లు ఉన్నాయి.
 
అతను ఒక పేద కుటుంబం నుండి వచ్చాడు. అతని తండ్రి, తాత స్వాతంత్ర్య సమరయోధులు. పశ్చిమ బెంగాల్‌లోని లాల్‌గఢ్‌లో కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్న అతని సోదరుడిని కాల్చి చంపిన తర్వాత, పార్టీ సోనును లాల్‌గఢ్ కార్యకలాపాలను చేపట్టమని కోరింది. గత డిసెంబర్‌లో, అతని భార్య విమల సిడం అలియాస్ తారా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముందు లొంగిపోయారు.
 
ఆమె కూడా 30 సంవత్సరాల క్రితం మావోయిస్టులలో చేరి దండారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా ఎదిగింది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలలో మావోయిస్టులు భారీ నష్టాలను చవిచూసిన తర్వాత తెలుగులో రాసిన అతని మూడు లేఖలు వచ్చాయి.