తిరుమల పరకామణి రికార్డ్స్ సీజ్ చేయలేదు.. నిద్రపోతున్నారా!

తిరుమల పరకామణి రికార్డ్స్ సీజ్ చేయలేదు.. నిద్రపోతున్నారా!
ఏపీ పోలీసులపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. పరకామణిలో చోరి కేసుకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలను ఆమలు చేయకపోవడంపై సోమవారం జరిగిన విచారణలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తిరుమల పరకాణి నుంచి రూ. 72,000 విలువ చేసే 900 అమెరికా డాలర్లు చోరీపై గతంలో విచారణ జరిసిన హైకోర్టు తిరుమల పరకామణిలో శ్రీవారి నగదు అపహరణ, కేసు నమోదు, లోక్‌ అదాలత్‌లో రాజీకి సంబంధించిన రికార్డులన్నీ సీజ్ చేసి, తదుపరి విచారణకు సీల్డ్ కవర్‌లో సమర్పించాలని సీఐడీ డీజీని ఆదేశించింది.
 
అయితే, ఆ ఆదేశాలు అమలు కాకపోవడంతో తాజా విచారణలో ఆగ్రహం వ్యక్తం చేసింది. గత నెల 19న ఆదేశాలు ఇస్తే, ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది.  పోలీసు శాఖ, డీజీపీ ఈ ఆదేశాలను పట్టించుకోలేదంటూ సోమవారం జరిపిన విచారణలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసు శాఖ నిద్రపోతోందని, రాష్ట్రంలో పోలీసు శాఖను మూసివేయడమే మంచిదని ఘాటుగా వ్యాఖ్యానించింది.
 
సీఐడీలో ఐజీ పోస్టు లేకపోతే వెంటనే తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని తగిన ఉత్తర్వులు ఎందుకు పొందలేదని ప్రశ్నించింది. సదుద్దేశం ఉంటే మరో ఐజీ స్థాయి అధికారితో రికార్డులు సీజ్ చేయించి ఉండేవారని వ్యాఖ్యానించింది.  సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి, ఆధారాలను తారుమారు చేయడానికి పోలీసు శాఖ, డీజీపీ నిందితులకు సహకరిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఈ కేసు మొత్తాన్ని తప్పుదోవ పట్టించారని, ఇప్పుడు రికార్డులు సీజ్ చేసినా ప్రయోజనం లేదని, అప్పటికే అన్నీ తారుమారు చేసి ఉంటారని సీరియస్‌గా స్పందించింది. ఈ కేసు విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్.
 
గత ప్రభుత్వ హయాంలో టీటీడీ పరకామణిలో జరిగిన కుంభకోణంపై సీఐడీతో విచారణ జరిపించాలని కోరుతూ తిరుపతికి చెందని జర్నలిస్ట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరకామణిలో ఉద్యోగి సీవీ రవికుమార్‌ పెద్ద మొత్తంలో విదేశీ డాలర్లు, బంగారం అపహరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై 2023 ఏప్రిల్‌ 29న అసిస్టెంట్‌ విజిలెన్స్, సెక్యూరిటీ అధికారి వై.సతీష్‌కుమార్‌ తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
అనూహ్యంగా ఈ కేసులో ఫిర్యాదుదారుడైన సతీష్‌కుమార్‌, నిందితుడు రవికుమార్‌తో స్వచ్ఛందంగా 2023 సెప్టెంబరు 9న లోక్‌ అదాలత్‌ వద్ద రాజీ చేసుకున్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన అసిస్టెంట్ విజిలెన్స్, సెక్యూరిటీ అధికారి వై.సతీష్‌కుమార్‌, నిందితుడు సీవీ రవికుమార్‌తో లోక్‌ అదాలత్‌లో రాజీ పడటంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ లోక్‌ అదాలత్‌లో కేసు రాజీ ఉత్తర్వులను సస్పెండ్‌ చేసి, రికార్డులను సీజ్‌ చేయాలని ఆదేశించారు.