
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన వేమనపల్లి మండల బిజెపి అధ్యక్షుడు ఏటా మధుకర్ ఆత్మహత్యకు గురైన విషాద ఘటన పట్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ప్రత్యేకంగా రైలులో మంగళవారం మంచిర్యాలకు చేరుకొని, ఆ గ్రామంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మధుకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలుపుతూ పార్టీ కోసం నిస్వార్థంగా పోరాడిన ధైర్యవంతుడు మధుకర్ కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యం, అక్రమ కేసులు, కాంగ్రెస్ నాయకుల వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బిజెపి కార్యకర్తలపై అణచివేత, భయపెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
అటువంటి దౌర్జన్యాలే మధుకర్ మృతికి కారణమని పేర్కొంటూ బిజెపి కార్యకర్తలందరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏ ఇబ్బంది వచ్చినా పార్టీకి తెలియజేయాలని, ఎవరూ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడకూడదని రాంచందర్ రావు హితవు చెప్పారు. మధుకర్ మృతికి బాధ్యులైన వారి పేర్లను ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నప్పటికీ ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
మధుకర్ మృతికి బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని రామగుండం సీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అతని కుటుంబాన్ని వేధించిన పోలీసులను సస్పెండ్ చేయాలనీ, నేరస్తులను ఎంతటివారైనా గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలు, అన్యాయానికి వ్యతిరేకంగా బిజెపి పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. మధుకర్ కుటుంబాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు కూడా పరామర్శించి భరోసా కల్పించారు.
More Stories
రెండు గంటల్లో హైదరాబాద్ – విజయవాడ ప్రయాణం!
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు