ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ పురస్కారం

ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ పురస్కారం
గతవారం ప్రారంభమైన నోబెల్ బహుమతుల ప్రకటన సోమవారంతో ముగిసింది. చివరగా ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాదికి గానూ నోబెల్ బహుమతి గెలుచుకున్న విజేతల పేర్లను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌ ప్రకటించింది. ఈ ఏడాదికి గానూ ఎకనామిక్స్‌ విభాగంలో మొత్తం ముగ్గురికి నోబెల్ బహుమతులు దక్కాయి.  జోయల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హోవిట్‌లు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు.
ఇక వీరందరికీ డిసెంబర్ 10వ తేదీన నోబెల్ బహుమతుల ప్రదానం జరగనుంది. జోయెల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హోవిట్‌లు అర్థశాస్త్రంలో చేసిన విశేష కృషిని గుర్తించి.. ఈ పురస్కారాన్ని అందించనున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ‘ఆవిష్కరణ-ఆధారిత ఆర్థిక వృద్ధిని వివరించినందుకు’, ‘సాంకేతిక పురోగతి ద్వారా స్థిరమైన వృద్ధికి ముందస్తు అవసరాలను గుర్తించినందుకు’, ‘సృజనాత్మక విధ్వంసం ద్వారా స్థిరమైన వృద్ధి సిద్ధాంతం కోసం’ ఈ ముగ్గురు చేసిన సేవలను గుర్తిస్తూ వీరికి నోబెల్ బహుమతి సంయుక్తంగా ప్రదానం చేయాలని రాయల్ స్వీడిష్ అకాడమీ నిర్ణయించింది.

నిరంతర వృద్ధికి కొత్త సాంకేతికత ఎలా దోహదం చేయగలదో వారు వివరించారని పేర్కొంది. గత రెండు శతాబ్దాల్లో చరిత్రలో మొదటసారి ప్రపంచవ్యాప్తంగా నిరంతర వృద్ధి నమోదైనట్లు స్వీడిష్‌ అకాడమి తెలిపింది. దీనివల్ల పెద్దసంఖ్యలో ప్రజలు పేదరిక నుంచి బయటపడమే కాకుండా ప్రపంచ శ్రేయస్సుకు పునాది వేసినట్లు పేర్కొంది. 

నూతన ఆవిష్కరణలు ప్రపంచ పురోగతికి ఎలా దోహదం చేస్తాయో జోయల్‌ మోకిర్, ఫిలిప్‌, పీటర్‌ వివరించినట్లు స్వీడిష్‌ అకాడమీ తెలిపింది. మోకిర్‌, హోవిట్‌లు అమెరికాకు, అఘియన్‌ బ్రిటన్‌కు చెందిన ఆర్థిక నిపుణులు. సాంకేతిక పురోగతి ద్వారా స్థిరమైన వృద్ధికి ముందస్తు అవసరాలను గుర్తించినందుకు మోకిర్‌ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. క్రియేటివ్‌ డిస్ట్రక్షన్‌ ద్వారా నిరంతర వృద్ధి సిద్ధాంతానికిగానూ మిగతా ఇద్దరికి నోబెల్‌ ప్రకటించారు. వైద్యవిభాగంతో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రకటన నేటితో ముగిసింది.