హమాస్ వైఖరితో శాంతి ప్రణాళిక అమలుపై నీలినీడలు

హమాస్ వైఖరితో శాంతి ప్రణాళిక అమలుపై నీలినీడలు
 
* భారత్ నుండి మంత్రి కీర్తి వర్ధన్‌ హాజరు
 
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళిక అమలుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ ప్రణాళికపై ఈజిప్ట్‌ రాజధాని కైరోలో సోమవారం అధికారికంగా సంతకాలు జరగాల్సి ఉండగా  ఈజిప్ట్‌లో జరిగే శాంతి చర్చలకు తాము హాజరవుతున్నామని హమాస్‌ తెలిపింది. అయితే,  ప్రణాళికలో నిరాయిధీకరణ, రాజకీయ బహిష్కరణ అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
 
హమాస్‌ నిర్ణయంతో ఈ ఒప్పందం భవితవ్యం అనిశ్చితిలో పడినట్లైంది. ప్రణాళికలో తన సభ్యులు గాజా స్ట్రిప్‌ను వీడాలన్న సూచనలను హమాస్‌ తోసిపుచ్చింది. ట్రంప్‌ ప్రతిపాదనలను నిరర్ధకమైనవిగా అభివర్ణించింది. హమాస్‌ రాజకీయ బ్యూరో సభ్యుడు హోసమ్‌ బద్రాన్‌ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ‘హమాస్‌ సభ్యులైనా కాకపోయినా పాలస్తీనియన్లు తమ మాతృభూమి నుండి బహిష్కరించడం అర్థం లేనిదని ‘ చెప్పారు. 
 
ప్రణాళిక రెండో దశపై సంప్రదింపులు జరగడం కష్టమేనని, ఎందుకంటే దానిలో అనేక సంక్లిష్టతలు, సమస్యలు ఉన్నాయని తెలిపారు. హమాస్‌ దాడి తర్వాత గాజాలో నిర్బంధంలో ఉన్న ఇజ్రాయిల్‌ బందీల విడుదల కార్యక్రమానికి హాజరయ్యేందుకు ట్రంప్‌ మధ్యప్రాచ్యంలో అడుగుపెడుతున్నారు. అయితే అనేక ముఖ్యమైన రాజకీయ ఆటంకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని, ప్రణాళికలో భాగంగా ఉన్న నిరాయుధీకరణకు అంగీకరించే సమస్యే లేదని హమాస్‌ స్పష్టం చేసింది.

ఈజిప్ట్‌లోని షర్మ్‌-ఎల్‌ షేక్‌లో సోమవారం జరిగే గాజా శిఖరాగ్ర సమావేశానికి విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్‌ హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని అమెరికా, ఈజిప్ట్‌ అధ్యక్షులు డోనాల్డ్‌ ట్రంప్‌, అబ్దెల్‌ ఫతా అల్‌-సిసిలు దీనికి చివరి క్షణంలో ఆహ్వానించారు. అయితే మంత్రి కీర్తి వర్ధన్‌ హాజరవుతారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. 

గాజా స్ట్రిప్‌లో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉద్దేశించిన ఈ అంతర్జాతీయ సమావేశంకు ట్రంప్‌, అబ్దెల్‌ ఫతాలు సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారని, ఇరవైకి పైగా దేశాల నేతలతోపాటు ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్‌ దీనికి హాజరవుతున్నారని ఈజిప్ట్‌ అధ్యక్ష కార్యాలయం ప్రతినిధి తెలిపారు. సోమవారం చర్చల అనంతరం హామాస్‌ చెరలో ఉన్న ఇజ్రాయిల్‌ పౌరులను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

వారి కోసం వేలాదిమంది కుటుంబ సభ్యులు టెల్‌ అవీవ్‌కు చేరుకుని ఎదురుచూస్తున్నారు. గాజాలో ధ్వంసమైన పట్టణాలు, నగరాలకు పాలస్తీనియన్లు తిరిగి వస్తున్నారు. రెండేండ్ల యుద్ధం తర్వాత గాజా నగరంలో బుల్డోజర్లు శిథిలాలను తొలగించడం ప్రారంభించాయి. 2023 అక్టోబర్‌ నుంచి గాజాపై ఇజ్రాయిల్‌ యుద్ధంలో కనీసం 67,682 మంది మరణించారు. 1,70,033 మంది గాయపడ్డారు. 2023 అక్టోబర్‌ 7న జరిగిన దాడుల్లో ఇజ్రాయిల్‌లో మొత్తం 1,139 మంది మరణించారు . దాదాపు 200 మంది బందీలుగా పట్టుబడ్డారు.