
గత నెల 27న కరూర్ తొక్కిసలాట ద్వారా ఆత్మరక్షణలో పడిన టీవీకే అధినేత విజయ్ ను ఎన్డీయేలో చేరడం ద్వారా వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో నిర్ణయాత్మక శక్తిగా మారమని ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నుండి వరుసగా ఆహ్వానాలు అందుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో ఎవ్వరితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తానని ఇప్పటివరకు చెబుతూ వస్తున్న ఆయనకు ఆ విధంగా చేస్తే రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టం కాగలదని సున్నితంగా వారిస్తున్నట్లు తెలిసింది.
ఈ సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోనులో ఎన్డీయేలో చేరమని ఆహ్వానించినట్లు తెలుస్తున్నది. కలిసి నడవాలని, ఒంటరిగా పోటీచేస్తే గెలవడం కష్టమని, రాజకీయంగా మనుగడ సాగించలేమని తన అన్న చిరంజీవి రాజకీయ ప్రవేశాన్నిఉదాహరణగా చెప్పినట్టు తెలుస్తోంది. అన్నాడీఎంకే-బీజేపీ కూటమిలో చేరి ఎన్నికల్లో పోటీచేస్తే కూటమి అధికారంలోకి వస్తే ఉపముఖ్యమంత్రి పదవి, ఓడిపోతే ప్రతిపక్ష నేతగానైనా ఉండొచ్చని పవన్ సూచించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో రాజకీయ మనుగడ కోసం సరైన నిర్ణయం తీసుకోవాలనీ ఉప-ముఖ్యమంత్రి సూచించారని, దీనిపై విజయ్ కూడా పునరాలోచనలో పడ్డారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు, విజయ్ను అన్నాడీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి సైతం ఫోన్ ద్వారా సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయనకు పూర్తి మద్దతు ఇవ్వడానికి సిద్ధమని పళనిసామి చెప్పినట్లు సమాచారం. ఇదే సమయంలో ఎన్డీయే కూటమిలో చేరాలని కూడా విజయ్ను ఆహ్వానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అధికార డీఎంకే ఉమ్మడి శత్రువని, వచ్చే ఎన్నికల్లో దానిని ఓడించాలంటే కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. దీనికి విజయ్ స్పందిస్తూ పొంగల్ తర్వాత తన వైఖరి వెల్లడిస్తానని చెప్పినట్టు సమాచారం. ఇటీవల అన్నాడీఎంకే సభలో టీవీకే జెండాలు తమిళనాట సంచలనంగా మారాయి. దీంతో అన్నాడీఎంకే-టీవీకే పొత్తుపై ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి.
మరోవంక, తొక్కిసలాట జరగగానే బిజెపి నాయకత్వం సహితం రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వ వైఫల్యంగా విమర్శలు గుప్పిస్తూ విజయ్ కు నైతిక మద్దతు అందించింది. పైగా తొక్కిసలాటపై నిజనిర్ధారణకోసం ఆరుగురు ఎంపీల బృందాన్ని కూడా పంపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా కరూర్ వెళ్లి బాధితులను పరామర్శించారు.
తొక్కిసలాటకు ఆసరాగా తీసుకొని విజయ్ ను లక్ష్యంగా చేసుకొని డీఎంకే ప్రభుత్వం వేధించే ప్రయత్నం చేయడం, స్వయంగా డిజిపి విజయ్ తప్పిదం అన్నట్లు రాజకీయ ప్రకటన మాదిరిగా మాట్లాడటంను బిజెపి తప్పుబట్టింది. ఈ విషయంలో డీఎంకేను ఎదుర్కోవడంలో తాను ఒంటరివాడు కాదని, తాము అండగా ఉంటామనే భరోసాను ఇచ్చింది. సహనంతో ఈ విపత్కర పరిస్థితుల నుండి బైటకు వచ్చి, డీఎంకే కుతంత్రాలను ఎదుర్కోవాలని సూచించింది.
కరూర్ తొక్కిసలాటతో ప్రశ్నార్థకంగా మారిన విజయ్ రాజకీయ ప్రయాణంకు ఎన్డీయే పక్షాలు కొండంత అండగా ముందుకు రావడంతో తమిళనాడులో రాజకీయ శక్తుల పునరేకీకరణకు అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే, కాంగ్రెస్‌లోని ఓ వర్గం కూడా విజయ్‌తో కలిసి వెళ్లాలని పట్టుబడుతున్న ప్రచారం సాగుతోంది. కానీ, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు మాత్రం దీనిని తోసిపుచ్చి, వచ్చే ఎన్నికల్లో డీఎంకేతోనే ప్రయాణమని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, సెప్టెంబరు 27న చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, వందల మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై విజయ్ సీబీఐ దర్యాప్తును కోరుతూ వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన మద్రాసు హైకోర్టు.. సిట్ దర్యాప్తునకు అంగీకరించింది. అయితే, టీవీకే మాత్రం దీని వెనుక కుట్ర ఉందనే అనుమానంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, సీబీఐ విచారణ కోరుతోంది.
More Stories
లింగ నిష్పత్తులు పడిపోవటంపై ఆందోళన
బీహార్ లో జేడీయూ- బీజేపీ చెరో 101 సీట్లు
రాజ్యాంగం కారణంగానే ఐక్యంగా భారత్