భారత ప్రజల వద్ద రూ.337 లక్షల కోట్ల విలువైన బంగారం

భారత ప్రజల వద్ద  రూ.337 లక్షల కోట్ల విలువైన బంగారం
బంగారం భారతీయులకు ఎంతో ఇష్టమైన వాటిల్లో ముందు వరుసలో ఉంటుంది. వందల సంవత్సరాల నుంచి భారతీయుల జీవితాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఒకప్పుడు ఆభరణాలుగా ధరించేందుకు ఉపయోగించే వారు కానీ, ఇప్పుడు ఒక పెట్టుబడి సాధనంగా మారిపోయింది. అత్యవసర సమయంలో ఆర్థికంగా అండగా నిలుస్తుందని భావిస్తున్నారు. అందుకే వీలైనంత మేరకు తమ స్థోమతకు తగినట్లుగా బంగారం కొంటున్నారు. 
ఓవైపు బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నా బంగారం కొనేవాళ్లు కొంటూనే ఉన్నారు. సామాన్యులకు అందనంత దూరానికి బంగారం వెళ్లింది.  2025లోనే ఇప్పటి వరకు చూసుకుంటే పసిడి ధర ఏకంగా 62 శాతం పెరిగింది. అయితే, భారత ప్రజల దగ్గర ఎంత బంగారం ఉంది అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఆ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కళ్లు చెదరాల్సిందే. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర (24 క్యారెట్ల) రూ.1.25 లక్షల మార్క్ దాటింది. కిలో వెండి రేటు రూ.1.84 లక్షలపైకి ఎగబాకింది. 
 
అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా టారిఫ్‌లు, ఫెడ్ నిర్ణయాలతో పాటు దేశీయంగా దసరా, దీపావళి పండగ సీజన్ గిరాకీ బంగారం ధరలు పెరిగేందుకు కారణమవుతున్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధర భారీగా పెరిగిన క్రమంలో భారత ప్రజల వద్ద ఉన్న బంగారం విలువపై మోర్గాన్ స్టాన్లీ ఓ నివేదిక విడదల చేసింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.

మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం భారత్‌లో ప్రజల వద్ద మొత్తం 34,600 టన్నుల బంగారం ఉంది. దీని విలువ ప్రస్తుతం 3.8 ట్రిలియన్ డాలర్లుగా అంచనా. అంటే భారత కరెన్సీలో చూసుకుంటే ప్రజల వద్ద ఉన్న బంగారం విలువ రూ.337 లక్షల కోట్లు. ఇది భారత దేశ జీడీపీలో ఏకంగా 89 శాతంగా ఉంటుందని నివేదిక పేర్కొంది.  ప్రజల ఇంటి బ్యాలెన్స్ షీట్‌లో ఇది సానుకూల అంశంగా తెలిపింది. 

 
బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతుండడం ప్రజల సంపదను మరింత పెంచుతున్నట్లు శుక్రవారం విడుదల చేసిన నివేదికలో మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా బంగారం కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది.  ప్రపంచ బంగారం డిమాండ్‌లో భారత్ 26 శాతంతో ఉంది. చైనా 28 శాతంతో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. 
 
భారత ప్రజలు ఆర్థిక పరమైన ఆస్తుల్లో ఇటీవలి కాలంలో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటిఎఫ్)ల ద్వారా బంగారంలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. గడిచిన ఏడాది కాలంలో చూసుకుంటే గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి భారీగా పెట్టుబడులు వచ్చినట్లు పేర్కొంది. రానున్న భవిష్యత్తు కాలంలోనూ ఈ ట్రెండ్ కొనసాగవచ్చని, బంగారం కొనుగోలు చేసేందుకు భారత ప్రజలు ఆసక్తి కనబర్చవచ్చని పేర్కొంది.