విజయవాడ- సింగపూర్ మధ్య విమాన సర్వీసులు

విజయవాడ- సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
 
ఆంధ్రప్రదేశ్ కు గ్లోబల్ కనెక్టివిటీ మరింత విస్తరించబోతోంది. విజయవాడ – సింగపూర్ మధ్య ఇండిగో ఎయిర్‌లైన్స్ నవంబర్ 15 నుంచి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనుందని  కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.  ఈ సర్వీసులు వారానికి మూడు రోజులు — మంగళవారం, గురువారం, శనివారం — లభ్యమవుతాయని మంత్రి వివరించారు. 
 
ఈ మార్గంలో నడిచే విమానాలు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌లోని ప్రముఖ చాంగీ ఎయిర్‌పోర్ట్‌కు నేరుగా చేరనున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దక్షిణాసియా దేశాలకు ప్రయాణం మరింత సులభం కానుంది.  విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించడం ద్వారా రాష్ట్రంలోని ప్రవాసాంధ్రులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులుకి పెద్ద ఊరట లభించనుంది. 
 
ఇప్పటి వరకు సింగపూర్ వెళ్లాలంటే హైదరాబాద్ లేదా చెన్నై మార్గంగా వెళ్లాల్సి రావడంతో సమయం, ఖర్చు రెండూ పెరుగుతున్నాయి. పైగా, సింగపూర్‌లో భారీగా ఉన్న ఆంధ్రప్రాంతీయుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఈ మార్గం భవిష్యత్తులో అత్యంత రద్దీగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, “ఈ సర్వీసులు విజయవాడను అంతర్జాతీయ విమాన పటంలో మరింత బలపరుస్తాయి. భవిష్యత్తులో ఇతర ఆసియా నగరాలకు కూడా సేవలను విస్తరించే ప్రణాళిక ఉంది” అని తెలిపారు. 
సింగపూర్‌తో నేరుగా గగనతల సంబంధం ఏర్పడడం ద్వారా పర్యాటకం, వాణిజ్యం, ఇన్వెస్ట్మెంట్స్ రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయని వారు భావిస్తున్నారు.  ఇప్పటికే సింగపూర్‌లో కోట్లలో ఉన్న ప్రవాసాంధ్రులు తమ స్వస్థలానికి సులభంగా రాకపోకలు చేయగలరని, ఇది ప్రాంతీయ అభివృద్ధికి దోహదం చేస్తుందని ఆశిస్తున్నారు.