వాట్సప్‌ లేకపోతేనేం.. అరట్టై వాడండి

వాట్సప్‌ లేకపోతేనేం.. అరట్టై వాడండి
వాట్సప్‌కు పోటీగా తీసుకొచ్చిన స్వదేశీ మెసేజింగ్‌ యాప్‌ ‘అరట్టై’ పేరు ఇటీవల నెట్టింట మార్మోగుతోంది. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ దీని ప్రస్తావన వచ్చింది. వాట్సప్‌ ఖాతా పునరుద్ధరణకు సంబంధించి దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వాట్సప్‌ లేకపోతే ఏం.. అరట్టై వాడొచ్చు కదా అని సూచించింది. 
 
అసలేం జరిగిందంటే.. తన ఖాతాను వాట్సప్‌ బ్లాక్‌ చేసిందని, దాన్ని పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. సామాజిక మాధ్యమాలు ఇలా ఖాతాలను ఉన్నట్టుండి నిషేధించకుండా ఉండేలా మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్‌ న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై సుప్రీం ధర్మాసనం ఒకింత అసహనం వ్యక్తంచేసింది. 
 
ఆర్టికల్‌ 32 కింద ఈ పిటిషన్‌ ఎందుకు వేశారని అడిగింది. వాట్సప్‌ యాక్సెస్‌ ఉండటం ప్రాథమిక హక్కు ఎలా అవుతుంది? అని ప్రశ్నించింది. దీనికి పిటిషనర్‌ తరఫు న్యాయవాది బదులిస్తూ‘‘పిటిషనర్‌ ఓ పాలీ డయాగ్నిక్‌ సెంటర్‌లో పనిచేస్తున్నారు. గత 10-12 ఏళ్లుగా వాట్సప్‌లోనే తన క్లయింట్‌లతో టచ్‌లో ఉన్నారు. ఉన్నట్టుండి ఆ ఖాతాను బ్లాక్‌ చేశారు’’ అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 
 
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ  ‘‘అయితే ఏంటీ? కమ్యూనికేషన్‌ కోసం ఇతర యాప్‌లు కూడా ఉన్నాయి. వాటిని ఉపయోగించొచ్చు కదా..! ఈ మధ్యే స్వదేశీ యాప్‌ ‘అరట్టై’ కూడా వచ్చింది. దాన్ని వాడుకోండి. మేక్‌ ఇన్‌ ఇండియా!’’ అని సూచించింది. ఈ పిటిషన్‌ హైకోర్టులో కూడా విచారణకు అర్హమైంది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.  దీనిపై ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్‌ను తిరస్కరించింది. కోర్టు అనుమతితో పిటిషనర్‌ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు.
దేశీయ సంస్థ జోహో అభివృద్ధి చేసిన అరట్టైకి విపరీతమైన ప్రజాదరణ లభిస్తుంది. ఇప్పటికే కోటి మందికి పైగా దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అరట్టై అంటే తమిళంలో పిచ్చాపాటీ సంభాషణ అని అర్థం.  ఈ యాప్‌ ద్వారా మెసేజ్‌లు, వాయిస్‌, వీడియో కాల్స్‌ చేసుకోవటానికి, మీటింగుల్లో పాల్గొనటానికి, స్టోరీలు, ఫొటోలు, డాక్యుమెంట్స్‌ షేర్‌ చేసుకోవచ్చు. క్లీన్‌ ఇంటర్ఫేస్‌, పలు ఫీచర్లు, గోప్యత మీద దృష్టి పెట్టడం వంటి వాటితో మంచి ప్రత్యామ్నాయ వేదికగా పేరు తెచ్చుకుంటోంది. 
 
పాకెట్స్‌ అనేది అరట్టై ప్రత్యేకత. మనకు కావాల్సిన సమాచారాన్ని ఇందులో స్టోర్‌ చేసుకోవచ్చు. త్వరలో చాట్స్‌కు కూడా ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ తీసుకొస్తామని జోహో వ్యవస్థాపకులు శ్రీధర్‌ వెంబు వెల్లడించారు.