`గాజా శాంతి ఒప్పందం’కు మోదీకి ట్రంప్ ఆహ్వానం?

`గాజా శాంతి ఒప్పందం’కు మోదీకి ట్రంప్ ఆహ్వానం?

ఈజిప్టులో సోమవారం గాజా శాంతి ఒప్పందం జరగనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్-సిసి కూడా మోదీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 

చివరి నిమిషంలో మోదీకి ఆహ్వానం అందినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు హెచ్-1బీ వీసా ఫీజు పెంపు సమస్య కూడా ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ నుంచి మోదీకి ఆహ్వానం రావడం గమనార్హం.

ఈజిప్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం మధ్యాహ్నం షర్మ్-ఎల్ షేక్లో గాజా శాంతి ఒప్పందం జరగనుంది. గాజా యుద్ధాన్ని ముగించి, శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా ఈ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫతా అల్-సిసీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాల నేతలు కూడా పాల్గొననున్నారు. 

ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ సహా 20కి పైగా దేశాల నాయకులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇందులో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ పాల్గొంటారా? లేదా? అనేది ఇంకా తెలియరాలేదు.