క్వాల్కమ్ సీఈఓతో ఏఐ, ఇన్నోవేషన్​పై ప్రధాని చర్చ!

క్వాల్కమ్ సీఈఓతో ఏఐ, ఇన్నోవేషన్​పై ప్రధాని చర్చ!
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అమెరికన్ చిప్​ తయారీ సంస్థ క్వాల్కమ్ అధ్యక్షుడు, సీఈఓ క్రిస్టియానో ఆర్ అమోన్​తో భేటీ అయ్యారు. కృత్రిమ మేధస్సు, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి మొదలైన అంశాల్లో భారత్​ సాధించిన పురోగతి గురించి ఆయనతో చర్చించారు. భారతదేశ సెమీకండక్టర్​, ఏఐ మిషన్​ల పట్ల క్వాల్కమ్ చూపిస్తున్న నిబద్ధతను ప్రధాని మోదీ ప్రశంసించారు. 
 
సమిష్టి భవిష్యత్​ కోసం రూపొందించే టెక్నాలజీని బిల్డ్ చేయడానికి, భారతదేశం​ సాటిలేని ప్రతిభానైపుణ్యాలను, స్థాయిలను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం క్వాల్కమ్ సీఈఓతో సమావేశం అద్భుతంగా జరిగిందని పేర్కొంటూ ఎక్స్​లో మోదీ ఓ పోస్టు పెట్టారు.  భారత ఏఐ, సెమీకండక్టర్​ మిషన్​లతోపాటు, 6జీకి మద్దతుగా భారత్​-క్వాల్కమ్ మధ్య విస్తృత భాగస్వామాన్ని పెంపొందించడంపై ప్రధాని మోదీతో చర్చించినట్లు క్వాల్కమ్ సీఈఓ పేర్కొన్నారు. 

“మోదీకి కృతజ్ఞతలు. ఆయనతో అద్భుతమైన సమావేశం జరిగింది. ఏఐ స్మార్ట్​ఫోన్స్​, కంప్యూటర్లు, స్మార్ట్​గ్లాసెస్​, ఆటో, ఇండస్ట్రియల్ ఇలా పలు రంగాల్లో భారత్​ ఎకో సిస్టమ్​ మమ్మల్ని మరింత ప్రోత్సహించాయి” అని క్వాల్కమ్ సీఈఓ ఆర్​.అమోన్ పేర్కొన్నారు.

ఈ వారం ప్రారంభంలో ప్రధాని మోదీ, అమెరికన్ థింక్ ట్యాంక్​ హడ్సన్ ఇన్​స్టిట్యూట్​కు చెందిన వాల్టర్​ రస్సెల్ మీడ్​ నేతృత్వంలోని పలువురు థింకర్స్​తో, వ్యాపారవేత్తలతో మాట్లాడారు. ఈ సందర్బంగా “భారత్​-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో, ప్రపంచ శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం మా భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వారి సహకరం చాలా విలువైనదిగా భావిస్తున్నానని” మోదీ తెలిపారు.