బెంగాల్ సీఈఓకు మమతా బెదిరింపులపై ఈసీ ఆగ్రహం

బెంగాల్ సీఈఓకు మమతా బెదిరింపులపై ఈసీ ఆగ్రహం
పశ్చిమ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సిఈఓ)ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు రావడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసి) తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కావాలని ఈసీ అడిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.  బెంగాల్ సీఈఓ మనోజ్ అగర్వాల్ హద్దులు దాడితే ఆయనపై ఉన్న ‘అవినీతి ఆరోపణలు’ బయటపెడతామని ఒక సమావేశంలో మమతా బెనర్జీ పేర్కొన్నట్టు సమాచారం.
ఈ సమావేశానికి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్, మంత్రి అరూప్ బిశ్వాస్ కూడా హాజరైనట్టు తెలుస్తోంది.  రాష్ట్ర అధికారులను కూడా సీఈఓ బెదిరించినట్టు ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ఆరోపించారని చెబుతున్నారు.  మమతా బెనర్జీ ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కు వ్యతిరేకంగా తన వాదనను లేవనెత్తుతూ ఎన్నికల కమిషన్ అధికారులు అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించక ముందే తన ప్రభుత్వ అధికారులను “బెదిరిస్తున్నారని”, “రాజకీయ ప్రభావంతో వ్యవహరిస్తున్నారని” ఆరోపించారు.
పండుగ సీజన్ మధ్య పశ్చిమ బెంగాల్ పౌరులకు అస్సాంలోని విదేశీయుల ట్రిబ్యునళ్ల నుండి నోటీసులు జారీ చేస్తున్నారని అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఈ ఎస్ఐఆర్ కనిపించేది కాదు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్ ఆర్ సి  తరహా ప్రక్రియను నిర్వహించడానికి దీనిని ముసుగుగా ఉపయోగిస్తున్నారు” అని ఆమె విమర్శించారు.  మరోవంక, పశ్చిమ బెంగాల్‌లో ఎస్ఐఆర్ సరిగ్గా నిర్వహిస్తే సుమారు కోటి మంది ఓటర్ల పేర్లు తొలగించవలసి వస్తుందని బిజెపి నేత,  ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి స్పష్టం చేశారు.

2011లో మమతా బెనర్జీ అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర పోలింగ్ అధికారిపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి.  ముఖ్యమంత్రి వ్యాఖ్యల వీడియోను శనివారం సాయంత్రంలోగా తమకు పంపాలని సీఈఓ కార్యాలయాన్ని ఈసీ ఆదేశించినట్టు కోల్‌కతా సీఈఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి.  రాష్ట్ర ఎన్నికల అధికారిని బెదిరించిన ముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అసెంబ్లీలో బీజేపీ విపక్ష నేత సువేందు అధికారి ఎన్నికల కమిషన్‌కు ఇప్పటికే ఒక లేఖ సమర్పించారు.

సీఈఓపై మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను బహిర్గతం చేయాలని, లేకుంటే ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకునేంత వరకూ ఈసీ కార్యాలయం వెలుపల తమ పార్టీ నిరవధిక నిరసన చేపడుతుందని సువేందు అధికారి హెచ్చరించారు.