భారతీ సిమెంట్స్‌ లీజుల రద్దుకు రంగం సిద్ధం

భారతీ సిమెంట్స్‌ లీజుల రద్దుకు రంగం సిద్ధం
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన భారతి సిమెంట్ కార్పొరేషన్ కు ఇచ్చిన రెండు సున్నపు గని లీజులను రద్దు చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. కేంద్ర ప్రభుత్వ గనుల నిబంధన ఉల్లంఘన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 
 
కేంద్ర గనులశాఖ భారతి సిమెంట్స్ లీజ్ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయడంతో విచారణ జరిపిన ప్రభుత్వం, అడ్వకేట్ జనరల్ నివేదిక ఆధారంగా ఈ సున్నపురాయి లీజులు చట్టవిరుద్ధంగా మంజూరు చేసినట్లు గుర్తించింది. రాష్ట్ర గనులశాఖ తుది నివేదిక సమర్పించిన వెంటనే భారతి సిమెంట్స్ కు ఇచ్చిన రెండు లీజుల రద్దు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.


సున్నపురాయి వంటి ప్రధాన ఖనిజాల లీజులు వేలం ద్వారా మాత్రమే ఇవ్వాలని 2015లో కేంద్ర గనుల శాఖ సవరించిన నిబంధనలలో ఉంది. అంతేకాకుండా 2015 జనవరి 12 కు ముందు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ అయినా, 2017 జనవరి 11 నాటికి అన్ని అనుమతులు పొందకపోతే ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్ స్వయంగా రద్దు అవుతుంది. 
 
ఎన్నికలకు ముందు భారతి సిమెంట్స్ కు రెండు సున్నపురాయి గనుల లీజులు ఈ నిబంధనలను ఉల్లంఘించి 2024 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు నాటి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, తన సతీమణి భారతి డైరెక్టర్ గా ఉన్న భారతి సిమెంట్స్ కు రెండు లీజులను మంజూరు చేశారు. కడప జిల్లా కమలాపురంలోను, ఎర్రగుంట్ల మండలాల్లోని 509.18ఎకరాలు, 235.56ఎకరాల భూములలో ఈ లీజులను ఇచ్చారు. 
 
ఈ భూములు వాస్తవానికి రఘురాం సిమెంట్స్ కు చెందినవి కాగా, 2009లో భారతి సిమెంట్స్ వాటిని కొనుగోలు చేసింది. ఆ సమయంలోనే సున్నపురాయి లీజు కోసం దరఖాస్తు చేసుకొని లెటర్ ఆఫ్ ఇంటెంట్ పొందినా, నిర్ణీత సమయానికి అనుమతులు పొందక పోవడంతో ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వం నోటీసు జారీ చేసింది.  దీనిపై భారతి సిమెంట్ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టేటస్ కో విధించింది. ఆ తర్వాత 2023లో సంస్థ వాదనలు విని నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీంతో 2024 ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి నెల రోజుల ముందు నాటి జగన్ ప్రభుత్వం భారతి సిమెంట్ కు రెండు లీజులను ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఈ లీజులు కేంద్ర చట్టానికి విరుద్ధంగా ఉండడంతో కేంద్ర గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ లీజుల పైన పునః పరిశీలన చేయాలని కోరింది. దీంతో దీనిపైన అడ్వకేట్ జనరల్ నివేదిక ఆధారంగా ఇది చట్ట విరుద్ధంగా జరిగినట్టు గుర్తించింది. రాష్ట్ర గనుల నివేదిక తుది నివేదిక రాగానే ఈ లీజులను రద్దు చేయనుంది.