రైతుల కోసం ఖర్చు చేయడంలో వెనుకాడేది లేదని, వాళ్లు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గత ప్రభుత్వాలు రైతుల గురించి ఏనాడు పట్టించుకోలేదని, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కృషి ఉత్సవంలో ప్రధాని రెండు నూతన పథకాలు, ఇతర ప్రాజెక్టులను ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా పీఎం ధనధాన్య కృషి యోజన పథకం, పప్పుధాన్యాల ఆత్మనిర్భరత ప్రధకాలను రూ.35,440 కోట్లతో ప్రారంభించారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, మత్స్య, ఆహార ప్రాసెసింగ్ రంగాలలో రూ.5,450 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. రూ.815 కోట్ల విలువైన అదనపు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
“వికసిత్ భారత్ వైపు అడుగులు వేయడంలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి ప్రయోజనాల కోసం అనేక పథకాలు తీసుకొచ్చాం. ఈ చారిత్రాత్మక రోజున దేశ స్వావలంబన, రైతుల సంక్షేమం కోసం రెండు కొత్త పథకాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఇవి కోట్లాది మంది రైతుల జీవితాలను మార్చనున్నాయి. మేం ఏ పథకం ప్రారంభించినా పేదలను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నాం” అని ప్రధాని తెలిపారు.
“రైతుల ముఖాల్లో ఆనందం చూడాలనేదే మా మొదటి ప్రాధాన్యత. రైతులకు ఎదురవుతున్న సవాళ్ల పరిష్కారంలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయి. గత ప్రభుత్వాలు దేశంలోని 100కు పైగా జిల్లాలను వెనకబడిన జిల్లాలుగా ప్రకటించాయి. వాటి అభివృద్ధిని పూర్తిగా మరిచిపోయాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ వెనకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టిసారించి, వాటిని ఆశావహ జిల్లాలుగా ప్రకటించాయి” అని ప్రధాని గుర్తు చేశారు.
ఆయా ప్రాంతాల్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రాజెక్టులను అమలు చేస్తోందని చెబుతూ వీటన్నింటినీ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన కిందకు తీసుకొస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. గత ప్రభుత్వానికి వ్యవసాయ పట్ల సరైన దృక్పథం లేకపోవడం వల్లే బలహీనపడిందని కాంగ్రెస్పై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు.
రైతుల ఆదాయం పెంచేందుకు, పంటల సాగు వ్యయం తగ్గించేందుకు గత పదేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం ఎరువులపై రూ.13 లక్షల కోట్ల సబ్సిడీ ఇచ్చిందని మోదీ చెప్పారు. యూపీఏ పదేళ్లలో రూ.5 లక్షల కోట్లు మాత్రమే సబ్సిడీగా ఇచ్చిందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యవసాయరంగానికి ప్రభుత్వం బాసటగా నిలుస్తోందని చెప్పారు.
“వ్యవసాయం ఎప్పుడూ మన అభివృద్ధి ప్రయాణంలో కీలకమైన భాగంగా ఉంది. కాలం మారుతున్న కొద్దీ వ్యవసాయానికి ప్రభుత్వ మద్దతు లభించడం చాలా ముఖ్యం. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని విస్మరించాయి. వారి వద్ద దిశా నిర్దేశం లేదు. వ్యవసాయ శాఖలకు సంబంధించిన వివిధ ప్రభుత్వ విభాగాలు తమదైన రీతిలో పని చేశాయి. ఫలితంగా వ్యవసాయ రంగం క్రమంగా బలహీనపడటానికి దారితీసింది” అంటూ విచారం వ్యక్తం చేశారు.
“21వ శతాబ్దపు భారత్ వేగవంతమైన అభివృద్ధి సాధించాలంటే వ్యవసాయ రంగంలో సంస్కరణలు తప్పనిసరి. ఇది 2014లో ప్రారంభమైంది. పూర్వ ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణిని మార్చి, విత్తనం నుంచి మార్కెట్ వరకు అనేక సంస్కరణలు అమలు చేశాం. ఈ మార్పుల ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి” అని చెప్పారు.
దేశ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు దాదాపు రెట్టింపయ్యాయని, ఆహారధాన్యాలు, పళ్లు, కాయగూరల ఉత్పత్తి సుమారు 90 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగిందని, గతంలో ఇది 64 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉండేదని చెప్పారు. 2014 నుంచి తేనె ఉత్పత్తి రెట్టింపు అయిందని అన్నారు. అభివృద్ధి భారతాన్ని కోరుకుంటే ప్రతి రంగంలోనూ ఇండియా బలపడాల్సి ఉంటుందన్నారు. ఏవో కొన్ని సాధించినంత మాత్రాన తృప్తి పడిపోరాదని సూచించారు. వెనుకబడిన ప్రాంతాలపై దృష్టి పెట్టినప్పుడే గణనీయమైన ఫలితాలు ఉంటాయన్నారు.
“ధాన్యం ఉత్పత్తి సుమారు 90 మిలియన్ మెట్రిక్ టన్నులు పెరిగింది. పండ్లు, కూరగాయల ఉత్పత్తి 64 మిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా పెరిగింది. ఇవాళ భారత్ ప్రపంచంలో పాలు ఉత్పత్తిలో నంబర్ వన్, చేపల ఉత్పత్తిలో రెండో స్థానం, తేనె ఉత్పత్తి 2014తో పోలిస్తే రెండింతలు పెరిగింది. గుడ్ల ఉత్పత్తి కూడా రెండింతలైంది” అని తెలిపారు.
“ఈ కాలంలో ఆరు పెద్ద ఎరువుల కర్మాగారాలు ఏర్పాటు అయ్యాయి. రైతులకు 250 మిలియన్లకు పైగా సాయిల్ హెల్త్ కార్డులు ఇచ్చాం. సూక్ష్మ నీటిపారుదల సౌకర్యాలు 100 లక్షల హెక్టార్లకు చేరాయి. పీఎం పంట బీమా పథకం ద్వారా రైతులకు రూ. 2 లక్షల కోట్లకు పైగా బీమా క్లెయిమ్స్ అందాయి. ఇది చిన్న విషయం కాదు” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

More Stories
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట .. 10 మంది మృతి
ప్రజాస్వామ్యంలో పెరిగిపోతున్న వర్గ రాజకీయాలు
400 కిలోల బంగారంతో సహా రూ 400 కోట్ల మావోయిస్టుల నిధులు!