
జీవో 9 అమలు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై కాంగ్రెస్ నేతలు ఆదివారం జూమ్ సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరనుంది.
ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించనుంది. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి, బీసీ జనాభా 57.6 శాతం ఉన్నందున 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్ల పరిమితిని సవరిస్తూ చట్టం చీసుకువచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది.
హైకోర్టు తీర్పు కాపీ శుక్రవారం అర్ధరాత్రి వచ్చింది. ఒకవేళ ఆ కాపీ వచ్చినా రాకపోయినా, మినహాయింపు కోరుతూ అత్యవసరంగా స్పెషల్ లీవ్ పిటిషన్పై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును కోరే అవకాశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టుకు వెళ్లడమా? లేదా బిల్లులు క్లియర్ చేసేందుకు రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు వేచి చూడటమా? లేదా పార్టీ పరంగా 42 శాతం టికెట్లు ఇవ్వడమా అనే మూడు ఆప్షన్లపై ప్రభుత్వం చర్చించినట్లు తెలుస్తోంది. అయితే చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లడమే మేలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
కాగా, తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, తదుపరి చర్యలు, రిజర్వేషన్ల అంశంపై వివరణను ఆ లేఖలో కోరింది. ఇటీవలి కోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ కోరింది.తదననుగుణంగా ముందుకెళ్లాల్సిన అవసరాన్ని వెల్లడించింది.
మరోవంక, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేసినందున గడువు తీరిన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి పాత విధానం ప్రకారం ఎన్నికల సంఘం ముందుకు వెళ్లవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని తెలిపింది.
More Stories
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి
స్థానిక సంస్థల ఎన్నికలు, జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే