మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్

మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్‌ తన రాజకీయ ప్రయాణాన్ని ముగించి ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో కొత్త దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల ఆయన అమెరికాకు చెందిన టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌తో పాటు ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టార్టప్ ఆంత్రోపిక్‌లో సీనియర్ సలహాదారుగా నియమితులయ్యారు. ఈ రెండు సంస్థలు ప్రస్తుతం ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నాయి. 
 
సునాక్‌ ఈ నియామకం ద్వారా మళ్లీ గ్లోబల్ స్టేజ్‌పై తన మేధస్సుతో ప్రభావం చూపే అవకాశం పొందారు. గత జులైలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న సునాక్, ప్రస్తుతం పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఈ కొత్త బాధ్యతల గురించి రిషి సునాక్ తన లింక్డ్‌ఇన్ పోస్టులో స్వయంగా వెల్లడించారు. ఈ రెండు పదవుల ద్వారా తనకు లభించే ఆదాయాన్ని మొత్తం తన భార్య అక్షతా మూర్తితో కలిసి ప్రారంభించిన ‘ది రిచ్‌మండ్ ప్రాజెక్ట్’ అనే ఛారిటీ సంస్థకు విరాళంగా ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆంత్రోపిక్ సంస్థలో సునాక్ పాత్ర ప్రధానంగా అంతర్గత వ్యవహారాలకు, వ్యూహాత్మక సలహాలకు మాత్రమే పరిమితం కానుంది.  ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరిణామాలపై ఆయన కంపెనీకి మార్గనిర్దేశం చేస్తారు.

ఇక మైక్రోసాఫ్ట్‌లో కూడా ఆయన ఇదే తరహా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. రెండేళ్ల పాటు ఈ కంపెనీల తరఫున బ్రిటన్ ప్రభుత్వాన్ని లాబీయింగ్ చేయడానికి వీల్లేదు. అలాగే, ప్రభుత్వంలో ఉన్నప్పుడు తనకు తెలిసిన రహస్య సమాచారాన్ని ఈ పదవుల కోసం ఉపయోగించకూడదని ఏసీఓబిఎ  స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  గత జులైలో రిషి సునాక్ ప్రముఖ ఇన్వెస్టుమెంట్ బ్యాంకు గోల్డ్ మం శాక్స్ లో సలహాదారుగా తిరిగి చేరారు. 2000వ దశకం ప్రారంభంలో ఆయన ఇదే సంస్థలో అనలిస్ట్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.