
రెండేండ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ఎట్టకేలకు తెరపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన తొలి దశ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్-పాలస్తీనా తీవ్రవాద గ్రూపు హమాస్ గురువారం సంతకాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు అమల్లోకి వచ్చినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళాలు తెలిపాయి.
కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో గాజాలో యుద్ధం ముగిసిందంటూ వెల్లడించాయి. గాజా నుంచి ఇజ్రాయెల్ తన బలగాలను పాక్షికంగా ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. ఇరు పక్షాలు బందీలను విడుదల చేసేందుకు సన్నాహకాలు ప్రారంభించాయి. కాగా, యుద్ధంతో మరుభూమిగా మారిన గాజాకు అందించే సాయం పెరగాలని యుఎన్ చిన్నారుల సంస్థ యునిసెఫ్ పేర్కొంది.
గాజా భూభాగంలోకి ఆహార సాయాన్ని అందించేందుకు అన్ని సరిహద్దులను తెరవాలని యునిసెఫ్ పిలుపునిచ్చింది. ఇప్పటికే ఆహారం అందక చిన్నారుల్లో రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినిందని, వారిలో మరణాలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ”పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. శిశువుల రోగనిరోధక వ్యవస్థలు గతంలో ఎన్నడూ లేనంతగా దెబ్బతిన్నందున, నవజాత శిశువుల మరణాలు మాత్రమే కాకుండా, శిశువుల మరణాలు కూడా భారీగా పెరిగే ప్రమాదం ఉంది” అని యునిసెఫ్ ప్రతినిధి రికార్డో పైర్స్ పేర్కొన్నారు. ”వారు చాలా కాలంగా తిండి తినలేదు. కొద్ది రోజుల నుండి అస్సలు తినడం లేదు. దీంతో వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. చిన్నారులు ఆరోగ్యంగా పెరిగేందుకు, ఉష్ణోగ్రత మార్పులను లేదా వైరస్ వ్యాప్తిని తట్టుకోగలిగేందుకు సరైన విటమిన్లు మరియు పోషకాలు అవసరం” అని పైర్స్ తెలిపారు.
గాజాలో కాల్పుల విరమణ ముగిసిన మొదటి 60 రోజుల్లో, కొన్ని ప్రాంతాలు కరువును ఎదుర్కొంటున్నందున, ఆ ప్రాంతాలకు మానవతా సాయాన్ని అందించాలని ఐరాస యోచిస్తోందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పౌష్టికాహార మద్దతు మొదటి ప్రాధాన్యత అని యునిసెఫ్ పేర్కొంది. 50,000 మంది చిన్నారులు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నందున వారికి తక్షణ చికిత్స అవసరమని తెలిపింది.
More Stories
పాక్ కు అత్యాధునిక మిస్సైల్స్ను సరఫరాకు అమెరికా వ్యతిరేకత
కాబూల్పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?
మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి