
* నవంబర్ 25న ఆలయ ప్రధాన శిఖరంపై ప్రధాని జెండా ఆవిష్కరణ
500 ఏళ్లుగా హిందువులు ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర కల పూర్తిగా నెరవేరే తరుణం త్వరలోనే రానుంది. ఇప్పటికే 2024 జనవరిలో అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ పూర్తికాగా.. త్వరలోనే పూర్తి స్థాయి ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన శిఖరంపై నవంబర్ 25వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
శ్రీరామ జన్మభూమి తీరథ క్షేత్ర ట్రస్ట్ నవంబర్ 23 నుండి 25 వరకు రామాలయంలో మూడు రోజుల మెగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న సాధువులు, ఇతర ప్రముఖ అతిథులను ఆహ్వానిస్తారు. అయోధ్యలోని రామ జన్మభూమి సముదాయంలోని ఇతర దేవాలయాలలో కూడా జెండాలు ఎగురవేస్తారు. రామాలయంలోని 161 అడుగుల ఎత్తైన శిఖరంపై 42 అడుగుల జెండా స్తంభంపై జెండాను ఎగురవేస్తారు. ఈ వేడుకకు దాదాపు 5000 మంది అతిథులను ఆహ్వానిస్తారని, జాబితాను సిద్ధం చేస్తున్నారని ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. ధ్వజారోహణ కార్యక్రమం వివాహ పంచమితో సమానంగా జరుగుతుంది.
అయోధ్యలో ఈ రోజున, రాముడు, సీతాదేవి వివాహం జరుపుకుంటారు. దీనిని రామ-జానకి వివాహ్ అని కూడా పిలుస్తారు. ఈ రోజున, రాముడి బరాత్ (వివాహ ఊరేగింపు) అయోధ్య నుండి సీత జన్మించిన జనక్‌పూర్ (నేపాల్) వరకు ప్రయాణిస్తుంది. వివాహం ఘనంగా జరుగుతుంది. వివాహ పంచమిని శ్రీరాముడు, సీతాదేవి వివాహ వార్షికోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున అయోధ్యలో, రామ-సీతా వివాహ వేడుకను భజన-కీర్తన, రామాయణ పారాయణం, రామ-సీత శకటాల ప్రదర్శనతో సహా గొప్ప వైభవంగా జరుపుకుంటారు. నేపాల్‌లోని జనక్‌పూర్‌లో కూడా ప్రత్యేక వేడుకలు జరుగుతాయి.
మిథిలా నగర్ అని కూడా పిలువబడే జనక్‌పూర్, వివాహ పంచమికి ప్రధాన కేంద్రం. ఇక్కడ శ్రీరాముని బరాత్ వచ్చి వివాహం జరుపుకుంటారు. మిశ్రా ప్రకారం, ఈ సంవత్సరం అక్టోబర్ తర్వాత భక్తులు మొత్తం రామ జన్మభూమి ప్రాంగణాన్ని సందర్శించగలరు. “రామ జన్మభూమి అంతటా విస్తరించి ఉన్న మిగిలిన దేవాలయాల పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి” అని మిశ్రా తెలిపారు.
ఈ వేడుకతో అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రతీకాత్మకంగా పూర్తి అయినట్లు ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులకు సంకేతం ఇస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక అయోధ్య రామ మందిరంలో ఆలయ మొదటి అంతస్తుతోపాటు గర్భగుడి, పరిక్రమ మార్గం, 14 చిన్న ఆలయాల నిర్మాణాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఇక నవంబర్ 25వ తేదీన జెండా ఎగురవేసేందుకు ప్రధాని మోదీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు అయోధ్య ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు.
గతేడాది జరుపుకున్న ప్రాణప్రతిష్ఠ తర్వాత ఆలయ నిర్మాణం చివరి దశకు చేరుకున్న ఘట్టంగా ఈ కార్యక్రమం దేశభక్తి, విశ్వాసాల కలయికగా నిలవనుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఆలయ సముదాయం పూర్తిగా సిద్ధమైందని ఈ పవిత్రమైన హిందూ సంప్రదాయ చిహ్నాన్ని ఆవిష్కరించడం ద్వారా సంకేతం ఇస్తారు.
ప్రధానమంత్రి చేతుల మీదుగా జెండా ఎగురవేయడం అనేది ఆలయం, దాని అనుబంధ నిర్మాణాలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తుల కోసం తెరిచి ఉన్నాయని సూచిస్తుందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. 2022లో ఆలయ గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి కాగా, 2024 జనవరిలో జరిగిన ప్రాణప్రతిష్ఠ వేడుకతో ప్రారంభమైన దశలవారీ నిర్మాణ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది.
అయోధ్య రామాలయంలోని మొదటి అంతస్తు, గర్భగుడి పనులు పూర్తి కాగా అక్కడ రామ పరివార్ దేవతా విగ్రహాలను ఇప్పటికే ప్రతిష్ఠించారు. రెండో అంతస్తులో వివిధ భాషల్లో రామాయణ గ్రంథాలను భద్రపరిచే ఆధ్యాత్మిక ఆర్కైవ్‌గా రూపొందించనున్నారు. ప్రధాన ఆలయంలోని సముదాయంలో 14 చిన్న ఆలయాలు కూడా పూర్తి చేశారు. పర్కొట (బయటి సరిహద్దు), పరిక్రమ మార్గం నిర్మాణాలు కూడా పూర్తి అయి భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఇక గతేడాది అయోధ్య రామాలయాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 7 కోట్ల మంది భక్తులు బాలరాముడిని సందర్శించినట్లు ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
More Stories
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
ఆర్ఎస్ఎస్: సైద్ధాంతిక పరిణామ శతాబ్దం