జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో మజ్లీస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదని బిజెపి ఎంపి రఘునందన్ రావు ప్రశ్నించారు. మజ్లీస్ పార్టీ పోటీ చేయకపోవడంలోని ఆంతర్యం ఏమిటని ఆయన విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. కాంగ్రెస్- మజ్లీస్ పార్టీలు కలిసి ఈ నగరాన్ని ఎటు దారి తిప్పబోతున్నాయో ఆలోచించాలని ఆయన జూబ్లీహిల్స్ ఓటర్లను, మేధావులను, విద్యావంతులను కోరారు.
జూబ్లీహిల్స్‌లో బిజెపి అభ్యర్థి విజయాన్ని అడ్డుకోవడానికి మజ్లీస్ పార్టీ పోటీ చేయడం లేదని ఆయన విమర్శించారు. ప్రజలు ఈ కుట్రను గుర్తించి జూబ్లీహిల్స్‌లో బిజెపి అభ్యర్థికి విజయం చేకూర్చాలని ఆయన కోరారు. మజ్లీస్ పార్టీ బీహార్‌లో 30 సీట్లలో , ఉత్తర్ ప్రదేశ్‌లో 90 సీట్లలో, తమిళనాడులో, ఉత్తరాఖండ్‌లో, మహారాష్ట్రలో, జార్ఖండ్, రాజస్థాన్ లలో పోటీ చేసిందని ఆయన గుర్తు చేశారు.
ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో బిజెపి అభ్యర్థి గెలుపొందితే మేయర్ పదవి బిజెపికే వస్తుందని తెలుసుకుని కాంగ్రెస్, మజ్లీస్ పార్టీలు భయంతో ఒక్కటయ్యాయని ఆయన ఆరోపించారు. డిసెంబర్‌లో జరగబోయే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో మజ్లీస్ పార్టీకి మేయర్ స్థానాన్ని ఇవ్వాలన్న ఒప్పందం మేరకే మజ్లీస్ ఇప్పుడు పోటీ చేయడం లేదన్న అనుమానాన్ని రఘునందన్ రావు వ్యక్తం చేశారు.
ఇటీవల ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కూడా 2 సీట్లలో పోటీ చేసింది. అంటే దేశమంతా ఎన్నికలు వస్తే ఎంఐఎం పార్టీ ఎక్కడైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటుందని, కాని మన భాగ్యనగరంలో, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మాత్రం పోటీచేయదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం పార్టీ పోటీ చేసి 41,656 ఓట్లు సాధించింది రెండో స్థానంలో నిలిచిందని ఆయన గుర్తు చేశారు.
అప్పుడు తెలుగుదేశం పార్టీ 50,898 ఓట్లతో గెలిచిందని, కాంగ్రెస్ మూడో స్థానంలో, టీఆర్‌ఎస్ నాలుగో స్థానంలో నిలిచాయని ఆయన తెలిపారు. తరువాతి 2018, 2023 ఎన్నికల్లో కూడా ఎంఐఎం పోటీ చేసిందని, కానీ ఇప్పుడు, 2024 నవంబరులో జరగబోయే ఈ ఉపఎన్నికలో మాత్రం ఎంఐఎం పార్టీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టక పోవడం వెనక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఎంఐఎం పార్టీ ఇప్పుడు ఎవరికీ మద్దతు ఇస్తుంది? బీఆర్ఎస్ కేనా? లేక కాంగ్రెస్‌కేనా? ఈ ప్రశ్నకు సమాధానం ప్రజలే ఆలోచించాలని రఘునందన్ రావు సూచించారు. రేపు కాంగ్రెస్ అభ్యర్థి అధికారికంగా ప్రకటించిన తర్వాత, ఆ అభ్యర్థి నిజంగా కాంగ్రెస్‌దా, ఎంఐఎందా అన్నది ప్రజలందరికీ స్పష్టమవుతుందని ఆయన ఎద్దేవా చేశారు.
బిజెపి గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో 48 స్థానాలు గెలిచిందని, ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో బీజేపీ గెలిస్తే, మేయర్ పదవి కూడా బీజేపీ అభ్యర్థికే వస్తుందని తెలుసుకుని, కాంగ్రెస్–ఎంఐఎం పార్టీలు భయంతో, రాజకీయ లాభంతో ఒకటయ్యాయని ఆరోపించారు. ఈ కుట్ర వెనక మరో ఉద్దేశ్యం కూడా ఉందని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం ఒత్తిడికి లోనై, ఖబరస్తాన్ నిర్మాణాలపై వేగంగా నిర్ణయాలు తీసుకుంటోందని ధ్వజమెత్తారు.
జూబ్లీహిల్స్‌లో అర్జెంటుగా ఖబర్‌స్థాన్ నిర్మించాలనే ప్రణాళిక కూడా ఈ రాజకీయ ఒప్పందంలో భాగమే అంటూ అందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బిజెపి ఎంపీ హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో జరిగేది సాధారణ ఎన్నిక కాదని, ఇది కాంగ్రెస్–ఎంఐఎం కుమ్మక్కు రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయ పోరాటం అని స్పష్టం చేశారు.
ఎవరిని సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రాత్రికి రాత్రే ఖబర్‌స్తాన్లకు సంబంధించిన జీవోలు తీసుకొస్తుంది? రాత్రిపూటే కబర్‌స్తాన్ నిర్మాణాలకు టెండర్లు, పోలీస్ బందోబస్తులు, సీసీటీవీలు ఎందుకు ఏర్పాటు చేస్తోంది? అని ప్రశ్నించారు. ఇప్పటికే ఎంఐఎంలో పనిచేసిన నాయకులే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులుగా రంగంలోకి వస్తున్నారని చెబుతూ అంటే కాంగ్రెస్–ఎంఐఎం ఒకే తాను ముక్కలని స్పష్టం చేశారు.
మీ స్వంత నియోజకవర్గంలో స్మశానానికి స్థలం ఇవ్వలేకపోయిన మీరు, ఎందుకు ఆగమేఘాల మీద ఖబర్‌స్తాన్లకు స్థలం కేటాయిస్తున్నారో ప్రజలకు చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రఘునందన్ రావు నిలదీశారు. ఎవరికి బానిసలా పనిచేస్తున్నారు? అని ప్రశ్నించారు. రేపు పొరపాటున జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తే, ఆ ఓటు వాస్తవానికి ఎంఐఎం అభ్యర్థికే పడుతుందనే విషయం ఓటర్లు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
More Stories
విలక్షణమైన కార్యపద్ధతితో ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణం
తెలంగాణాలో రైతుల కంటే 10 రేట్లు విద్యార్థుల ఆత్మహత్యలు
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికలో కీలక నివేదిక