మిలిటెంట్లు దాడిలో 11 మంది పాక్ సైనికులు మృతి

మిలిటెంట్లు దాడిలో 11 మంది పాక్ సైనికులు మృతి
పాకిస్థాన్‌ లో మళ్లీ బాంబు దాడి జరగడం కలకలం రేపింది. సాయుధ బలగాలు వెళ్లే వాహనంపై మిలిటెంట్లు కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు అధికారులతో సహా 11 మంది పారామిలిటరీ సిబ్బంది, 19 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ ఘటనకు పాకిస్తాన్‌ తాలిబన్లు బాధ్యత వహించాయి అని పాకిస్తాన్‌ సైనిక వర్గాలు తెలిపాయి.
 
కుర్రం వాయువ్య జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ దాడి జరగడానికి ముందు ఉగ్రవాదులు కాన్వారుపై బాంబులు వేశారని పాకిస్తాన్‌ భద్రతా అధికారులు రాయిటర్స్‌ తెలిపారు. ఒర్జాకారు జిల్లాలో 19 మంది ఇస్లామిక్‌ ఉగ్రవాదులను హతమార్చడానికి నిర్వహించిన ఆపరేషన్‌లో తొమ్మిది మంది సైనికులు,  ఇద్దరు అధికారులు మృతి చెందారని పాకిస్తాన్‌ సైన్యం ప్రకటనను విడుదల చేసింది.
 
ఇక వివరాల్లోకి వెళ్తే అఫ్గానిస్థాన్‌ సరిహద్దుకు సమీపంలో కుర్రం జిల్లాలో పాక్‌ సైన్యం కాన్వయ్‌పై మిలిటెంట్లు ఈ దాడులు చేశారు. దాడికి పాల్పడిన వారి కోసం అక్కడి భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఈ ఆపరేషన్ లో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 19 మంది ఉగ్రవాదులు, లెఫ్టినెంట్ కల్నల్, మేజర్‌తో సహా 11 మంది పాకిస్తాన్ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారని సైనిక ప్రకటన తెలిపింది.
 
ఘటనా ప్రాంతంలో మిగతా ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొంది. కాగా, పాకిస్తాన్‌ ప్రభుత్వాన్ని పడగొట్టి ఇస్లామిక్‌ పాలనను తీసుకురావాలని తెహ్రీక్‌ – ఇ- తాలిబాన్‌ పాకిస్తాన్‌, పాకిస్తాన్‌ భద్రతా దళాలపై దాడుల్ని ముమ్మరం చేసింది. గత మూడు నెలల్లో పాకిస్తాన్‌లో ఉగ్రవాద దాడులలో కనీసం 901 మంది మరణించగా 599 మంది గాయపడ్డారు.