కోనసీమ బాణసంచాలో భారీ పేలుడు.. ఏడుగురి సజీవ దహనం

కోనసీమ బాణసంచాలో భారీ పేలుడు.. ఏడుగురి సజీవ దహనం
 
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. 
 
అలాగే ఈ ఘటనలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమచారం.  బాణాసంచా తయారీ కేంద్రం నిర్వాహకుడు సత్యనారాయణ కూడా మృతి చెందారు.  బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగిన సమయంలో అందులో 40 మంది వరకూ పనిచేస్తున్నట్లు సమాచారం. 
పేలుడు కారణంగా బాణసంచా తయారీ కేంద్రం షెడ్డు గోడ కూడా కూలిపోయింది. ఈ శిథిలాల కింద కొంతమంది చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బాణ‌సంచా పేలుడు ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డ్డ వారికి మెరుగైన వైద్యం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు, ప్ర‌స్తుత ప‌రిస్థితి, స‌హాయ‌క చ‌ర్య‌లు, వైద్యసాయంపై వివ‌రాల‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.