మహిళల చైతన్యం కోసం సప్త శక్తి ‌సంగం

మహిళల చైతన్యం కోసం సప్త శక్తి ‌సంగం
మహిళా లోకంలో చైతన్యం పెంచే దిశగా ‘సప్త శక్తి సంగం’ అనే పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు విద్యాభారతి దక్షిణ భారత క్షేత్ర అధ్యక్షులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ చామర్తి ఉమా మహేశ్వర రావు తెలిపారు. దీని ద్వారా సుమారు 76 లక్షల మంది మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించే అద్భుతమైన కార్యక్రమం అని మీడియా సమావేశంలో చెప్పారు. 
 
ఈ కార్యక్రమాన్ని రాణి దుర్గావతి జయంతి సందర్భంగా అక్టోబర్ 5 నుంచి‌ మొదలు పెట్టామని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన జనవరి 23 వరకు జరుపుతామని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న 24 వేల విద్యా భారతి విద్యాలయాలతో పాటు మన రాష్ట్రంలో ఉన్న 225 విద్యాలయాల్లో మాతృ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

సప్తశక్తి సంగం గురించి వివిధ దశలలో కార్యాచరణ జరుగుతోందని చెబుతూ  విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ద్వారా ‘మహిళల యొక్క’,’మహిళల కొరకు’,’మహిళల ద్వారా’ నప్తశక్తి సంగం గొప్ప చైతన్యం తీసుకొస్తుందని వివరించారు .  ఈ కార్యక్రమం ద్వారా 15 వేల సప్త శక్తి సంగం కార్యక్రమాల యోజన ద్వారా 76 లక్షల మహిళల భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు. 

 
పదివేల మంది మహిళా కార్యకర్తల జాబితా తయారవుతున్నదని, 800 శిక్షితులైన మహిళా వక్తలు తయారవుతారని చెప్పారు. 50 లక్షల కర పత్రాలు సమాజంలోకి  వెళతాయని, భారతీయ ఆలోచన ఇంటింటికి వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  అంతిమంగా 3.5 కోట్ల కుటుంబాలతో సంపర్కం ఏర్పడుతుందని, సిద్ధాంతం గురించి అవగాహన ఏర్పడుతుందని వివరించారు. స్వదేశీ వస్తువుల ఉత్పత్తి, విక్రయం పెరుగుతుందని అభిలాష వ్యక్తం చేశారు.

శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అనఘా వెంకట లక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్తిగా మహిళల భాగస్వామ్యంతోనే కార్యక్రమాలు జరుగుతాయని, రాష్ట్రమంతటా అన్ని శిశుమందిర్ లలో ఆచార్యులు, మాతాజీలు పాల్గొంటారని తెలిపారు. అఖిల భారతీయ ప్రచార ప్రభారీ లింగం సుధాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సంఘటనా మంత్రి పతకమూరి శ్రీనివాస్, రాష్ట్ర శిశు వాటిక ప్రముఖ్ కొత్తపల్లి ఉమ కూడా పాల్గొన్నారు.