ఈ నెల 12 న విశాఖపట్నం వేదికగా జరగనున్న ఇండియా – ఆస్ట్రేలియా మ్యాచ్ లో మహిళా క్రికెటర్లు దిగ్గజాలు మిథాలీ రాజ్, రావి కల్పనలకు అరుదైన గౌరవం లభించనుంది. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 12న విశాఖపట్నంలోని వీడీసీఏ స్టేడియంలో జరగబోయే భారత్-ఆస్ట్రేలియా మహిళల ప్రపంచకప్ మ్యాచ్ సందర్భంగా మహిళా క్రికెట్ దిగ్గజాలు మిథాలీ రాజ్, రావి కల్పన ఘన సత్కారం అందుకోబోతున్నారు.
ఈ సందర్భంగా స్టేడియంలోని ఒక స్టాండుకు మిథాలీ రాజ్ పేరు, ఒక గేటుకు రావి కల్పన పేరు పెట్టనునట్టు ఏసీఏ ప్రకటించింది. మహిళల క్రికెట్ అభివృద్ధికి వారు చేసిన కఅషి, సాధించిన విజయాలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ చొరవను అభినందిస్తూ మహిళా క్రికెటర్లకు లభిస్తున్న ఈ గుర్తింపు రాష్ట్రం క్రీడల్లో సమ్మిళితత్వం, ప్రతిభకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.
క్రీడా రంగంలో సదుపాయాలు, శిక్షణ మార్గాలు, గుర్తింపు అవకాశాలను పెంపొందించడంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ కూడా ఈ దిశగా శక్తివంతమైన నాయకత్వాన్ని అందిస్తున్నారని సంస్థ పేర్కొంది. ఏసీఏ తీసుకున్న ఈ నిర్ణయం, భారత మహిళా క్రికెట్కు మిథాలీ రాజ్, రావి కల్పన అందించిన సేవలను మాత్రమే కాకుండా, రాబోయే తరాల యువ క్రీడాకారిణులకు పెద్ద కలలు కనాలని ప్రేరేపించే ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోనుంది.

More Stories
పరకామణి కేసులో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు
చిత్తూర్ మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష
భగవద్గీతపై టిటిడి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల దుమారం