
రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి వరించింది. మెటల్ అర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్‌ను అభివృద్ధి చేసినందుకు గాను జపాన్‌లోని క్యోటో విశ్వవిద్యాలయానికి చెందిన సుసుము కిటగావా, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన రిచర్డ్ రాబ్సన్, అమెరికాకు చెందిన ఒమర్ ఎం. యాఘీలను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం ప్రకటించింది.
వీరు కొత్త రకం మాలిక్యూలర్ ఆర్కిటెక్చర్ అభివృద్ధి చేసినట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది. నోబెల్ బహుమతి గ్రహీతలు వాయువులు, ఇతర రసాయనాలు ప్రవహించే అతిపెద్ద ఖాళీలతో పరమాణు నిర్మాణాలను సృష్టించారు. ఈ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ ఎడారిగాలి నుండి నీటిని సేకరించడానికి, కార్బన్‌డయాక్సైడ్‌ను సంగ్రహించడానికి, విషవాయువులను నిల్వ చేయడానికి లేదా రసాయన ప్రతిచర్యలను ఉత్ప్రేరీకరించేందుకు వినియోగించవచ్చు.
మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్‌ల అభివృద్ధి అనేది రసాయన శాస్త్రవేత్తలకు సమాజంలోని పలు సవాళ్లను పరిష్కరించడానికి కొత్త అవకాశాలను అందించింది. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన విషపూరిత వాయువులను నిల్వ చేయడానికి ఎంఓఎఫ్ పదార్థాలను ఉపయోగిస్తున్నారు. ఫ్యాక్టరీలు, విద్యుత్ కేంద్రాల నుంచి కార్బన్ డై ఆక్సైడ్‌ను సంగ్రహించి, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి అనేక కంపెనీలు ఎంఓఎఫ్ పదార్థాలను పరీక్షిస్తున్నాయి. ఈ ముగ్గురు శాస్త్రవేత్తల ఆవిష్కరణలు పర్యావరణ పరిరక్షణ, పరిశ్రమలలో సురక్షితమైన, సమర్థవంతమైన పరిష్కారాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
More Stories
గాజా మారణకాండకు ముగింపుకు కైరోలో చర్చలు
పాకిస్థాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై మళ్లీ బాంబు దాడి
భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం