ఈపీఎస్‌ కనీస పెన్షన్‌ రూ. 2,500కు పెంపు?

ఈపీఎస్‌ కనీస పెన్షన్‌ రూ. 2,500కు పెంపు?
 
 ప్రస్తుతం 1,000 రూపాయలుగా ఉన్న ఈపీఎస్‌ కనీస పెన్షన్‌ త్వరలో 2,500 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. ఈ నెల 10-11 తేదీల్లో బెంగళూరులో జరిగే ఈపీఎఫ్‌వో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. పెన్షన్‌ పెంపు ప్రతిపాదనకు ఈ సమావేశంలో ఆమోదం పొందితే 11 ఏండ్ల తర్వాత అతి పెద్ద పెన్షన్‌ పెంపు అవుతుంది.
 
ఈ నిర్ణయం ఆమోదించబడితే, దేశవ్యాప్తంగా లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఉపశమనం లభించనుంది. రూ.1,000 కనీస పెన్షన్‌ విధానాన్ని 2014లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఈ విధానంలో పెన్షనర్లకు ఒక్క రూపాయి కూడా పెంచలేదు. దేశవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది ఈ కనీస పెన్షన్‌నే అందుకుంటున్నారు.

ప్రస్తుతం ఈపీఎస్‌ పథకంలో కనీసం 10 ఏళ్ల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసి, 58 ఏళ్ల వయస్సు చేరుకున్న ఉద్యోగులు పింఛన్‌కు అర్హులు అవుతున్నారు. కానీ నెలకు రూ.1,000 పింఛన్‌తో జీవనోపాధి సాగించడం కష్టమని పింఛన్‌దారులు చాలా కాలంగా ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రస్టీల సమావేశంలో పింఛన్ పెంపు అంశం ప్రధానంగా చర్చకు రానుంది. 

ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే, దాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించాల్సి ఉంటుంది. కేంద్ర ఆమోదం లభించిన వెంటనే కొత్త రేట్లు అమలులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ఉద్యోగ సంఘాలు మాత్రం కనీస పింఛన్‌ను రూ. 7,500కు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, కనీస పింఛన్ పెంపు నిర్ణయం తీసుకుంటే అది రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక భద్రతకు మాత్రమే కాకుండా, సామాజిక సంక్షేమానికి కూడా మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌ఓ) 1995లో ప్రవేశపెట్టిన ఎంప్లాయి పెన్షన్‌ స్కీమ్‌ (ఈపీఎస్‌) వ్యవస్థీకృత రంగంలో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ చేసిన తర్వాత పెన్షన్‌ అందిస్తుంది.