
స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీ హిల్స్ ఉపఎన్నికకు సిద్దమవుతున్న సమయంలో తెలంగాణాలో ఇద్దరు మంత్రుల మధ్య `దున్నపోతు’ వాఖ్య దుమారం రేపడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది. మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్‌ను ఉద్దేశించి మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ‘దున్నపోతు’వ్యాఖ్యలు అధికార పార్టీలో దుమారం రేపుతున్నాయి.
దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ ‘ఏం తెలుసు.. ఆ దున్నపోతుగాడికి’ అంటూ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా దీనిపై మంత్రి అడ్లూరి స్పందించి స్వయంగా వీడియో విడుదల కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఈ వివాదం సమిసిపోయినట్టేనని భావించిన తరుణంలో మంగళవారం మరింత రాజుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ తనపై చేసిన వ్యాఖ్యలకు బుధవారం వరకు క్షమాపణ చెప్పకపోతే తదుపరి పరిణామాలకు బాధ్యతవహించక తప్పదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో కూడా విడుదల చేసారు. దళిత సామాజికవర్గం నుంచి తనను మంత్రిగా నియమించడాన్ని జీర్ణించుకోలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేసారని ఆడ్లూరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అంశంపై పార్టీ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలను కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు కూడా ఆయన తెలిపారు. తనకు మంత్రి పదవి ఇచ్చినప్పటి నుంచి మరో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రవర్తనలో కూడా మార్పు వచ్చిందని ఆయన ఆరోపించారు. ఏదైనా మీటింగ్‌కు తాను వెళితే, తన పక్కన కూర్చొవడానికి కూడా ఇష్టపడని మంత్రి వివేక్ లేచి వెళ్లిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
ఇలా ఉండగా మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలపై చర్య తీసుకోవాలని కోరుతూ సొంత పార్టీకి చెందిన దళిత సామాజికవర్గం ఎమ్మెల్యేలు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి డిమాండ్ చేసారు. ఈ వివాదాన్ని పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌ను ఆరా తీసినట్టు పార్టీ వర్గాల సమాచారం. రాష్ట్రంలో ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రుల మధ్య పంచాయతీ ఏంటని అధిష్ఠానం తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
పరిస్థితి చేయిదాటక ముందే ఈ వివాదాన్ని పరిష్కారించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదేశించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే మహేశ్‌కుమార్‌గౌడ్ మంగళవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, ఆడ్లూరి లక్ష్మణ్‌లకు ఫోను చేసి ఈ వివాదానికి ఇంతటితో తెరదించాలని ఆదేశించారు. అయినప్పటికీ ఎవరు కూడా వెనక్కి తగ్గకపోవడంతో బుధవారం వీరిద్దరిని పిలిచి చర్చించబోతున్నట్టు మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాకు తెలిపారు.
More Stories
అత్యుత్తమ పరిశోధన కేంద్రంగా సమ్మక్క, సారక్క యూనివర్సిటీ
మహిళల చైతన్యం కోసం సప్త శక్తి సంగం
ఓటర్ కార్డులు కాంగ్రెస్ నేత పంపిణీపై బిజెపి ఫిర్యాదు