
సాంస్కృతిక వారసత్వం, సంచార జాతుల ప్రజలు ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అత్యుత్తమ పరిశోధన విశ్వవిద్యాలయంగా నిలవగలదని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగోను మంగళవారం ఢిల్లీలో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వై. శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ఈ యూనివర్సిటీ ద్వారా చాలా విషయాలు వెలుగులోకి తీసుకురావచ్చని చెప్పుకొచ్చారు. తెలుగు, హిందీ, మరాఠీతో సహా స్థానిక గిరిజన భాషను మెరుగు పరచవచ్చని వెల్లడించారు. సమ్మక్క – సారక్క యూనివర్సిటీ లోగో వినూత్నంగా ఉందని కేంద్ర మంత్రి కొనియాడారు. యూనివర్సిటీ లోగోలో గిరిజనుల భాషలు కోయ, బంజారా, గోండు పొందుపరచడంపై అభినందించారు. త్వరలో సమ్మక్క – సారక్క యూనివర్సిటీని సందర్శిస్తానని, కొత్త క్యాంపస్కి శంకుస్థాపన చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని భరోసా ఇచ్ఛారు. ఈ యూనివర్సిటీకి రూ. 800 కోట్లకు పైగా నిధులు కేటాయించామని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గుర్తు చేశారు. సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగోలో ప్రధాన ఆకర్షణగా పలు చిహ్నాలు ఉన్నాయి. సమ్మక్క – సారక్క ట్రైబల్ యూనివర్సిటీ లోగో మధ్యలో సమ్మక్క – సారక్కల పసుపు బొమ్మలు ఉన్నాయి.
సమ్మక్క దేవతని కుంకుమతో సూచించేలా మధ్యలో ఉన్న ఎర్రటి సూర్యుడుని పొందుపరిచారు. ప్రశాంతమైన ఆధ్యాత్మిక కోణాన్ని జోడించే పీఠాలపై దైవతల బొమ్మలు ఉన్నాయి. గిరిజన దుస్తులు, సౌందర్యానికి అంతర్భాగంగా నెమలి ఈకలని పొందుపరిచారు. ఈ లోగోలో సాంస్కృతిక గౌరవం, ధైర్యం సంప్రదాయాన్ని సూచించే రెండు కోణాల జంతువుల కొమ్ములతో కూడిన కిరీటం ఏర్పాటు చేశారు.
ఎర్రటి సూర్యుడు జ్ఞానోదయాన్ని, కొత్త ప్రారంభాన్ని సూచిస్తాడు. నెమలి ఈకలు సాంస్కృతిక సౌందర్యాన్ని, కళాత్మకతను ప్రతిబింబిస్తాయి. అదేవిధంగా జంతువు కొమ్ములతో కూడిన కిరీటం ధైర్యం, సంప్రదాయ గౌరవం, గిరిజన గర్వాన్ని సూచిస్తుంది. మొత్తం లోగో రూపకల్పనలో ప్రతి చిహ్నం గిరిజనుల జీవన విధానం, విలువలు, సహజసిద్ధత పట్ల గల గౌరవాన్ని ప్రతినిధ్యం చేస్తుంది.
సమ్మక్క–సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ స్థాపనతో తెలంగాణ గిరిజన సమాజానికి విద్యా రంగంలో కొత్త వెలుగులు నింపబడతాయనే అంచనాలు ఉన్నాయి. గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్య, పరిశోధన, సాంస్కృతిక అధ్యయనాలు అందుబాటులోకి రావడమే కాకుండా, స్థానిక సంప్రదాయాలు, భాషలు, వృత్తులు సురక్షితంగా నిలవడానికి ఇది బలమైన వేదిక కానుంది.
ఈ విశ్వవిద్యాలయం ములుగు ప్రాంతాన్ని జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక–సాంస్కృతిక కేంద్రంగా నిలబెట్టబోతోందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి, ఈ లోగో ఆవిష్కరణతో సమ్మక్క–సారక్క విశ్వవిద్యాలయం గిరిజన గౌరవానికి ప్రతీకగా, విద్యా–సంస్కృతి కలయికకు సంకేతంగా నిలిచింది.
More Stories
`దున్నపోతు’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రుల కుమ్ములాటలు
భారత నాగరిక ఆత్మ సంరక్షకునిగా వందేళ్ల ఆర్ఎస్ఎస్
బాగ్రామ్ స్థావరంపై ట్రంప్ ప్రయత్నంకు వ్యతిరేకం